తెలుగబ్బాయి సత్తా చాటినా.. టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితం
X
వరల్డ్ క్లాస్ ఫామ్ తో దూసుకుపోతున్న బ్యాట్స్ మెన్ ఒకరు. వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాట్స్ మెన్ ఇంకొకరు. జట్టు మొత్తం ఐపీఎల్ లో సత్తా చాటిన ఆటగాళ్లే. తీరా చూస్తే.. రెండు మ్యాచుల్లో ఒక్కరిద్దరు మినహా ఏ బ్యాట్స్ మెన్ రాణించలేకపోయారు. గయాన్ వేదికపై వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆడుతుంది అంతర్జాత రెండో మ్యాచ్ అయినా, తోటి బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ చేరుతున్నా తెలుగు తేజం తిలక్ వర్మ (51, 41 బంతుల్లో) ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (27, 23 బంతుల్లో) రాణించినా మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (7, 9 బంతుల్లో) మరోసారి నిరాశ పరిచాడు.
సూర్యకుమార్ యాదవ్ (1, 3 బంతుల్లో)ను లక్ మరోసారి వెక్కిరించింది. కేల్ మేయర్స్ చేతిలో రన్ ఔట్ అయ్యాడు. నాలుగో వికెట్ లో వచ్చిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. హార్దిక్ పాండ్యా (24, 18 బంతుల్లో)తో కలిసి స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు. సంజూ శాంసన్ (7, 7 బంతుల్లో) అనవసర షాట్ ఆడి కీపర్ క్యాచ్ ఇచ్చాడు. చివర్లో అక్షర్ పటేల్ (14, 12 బంతుల్లో) చేయి వేయడంతో 152 పరుగులు దాటింది. కొస మెరుపుగా రవి బిష్ణోయ్ సిక్సర్, అర్ష్ దీప్ సింగ్ ఫోర్ తో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.