Mayank Agarwal : విమానంలో క్రికెటర్‌కు అస్వస్థత..హెల్త్ బులిటెన్ విడుదల
X
భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అగర్తల నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అగర్తలలోని ఐఎల్ఎస్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. ఓరల్ ఇరిటేషన్‌కు మయాంక్ గురయ్యాడని, దాని వల్ల అతని పెదాలు బాగా వాచిపోయాయని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మయాంక్ అగర్వాల్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
మయాంక్ అగర్వాల్ నిన్న ఆస్పత్రిలో చేరాడని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. కాగా మయాంక్ అగర్తలలో విమానం ఎక్కిన తర్వాత తన సీటు ముందున్న పౌచ్‌లో ద్రవాన్ని సేవించాడు. ఆ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని కథనాలు వెలువడ్డాయి. గొంతులో వాపు, బొబ్బలు రావడంతో మయాంక్‌ను స్థానికంగా ఉన్న ఐఎల్ఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
ఈ ఘటనపై మయాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును మొదలుపెట్టామని పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్‌గా ఉన్నారు. త్రిపుర, కర్ణాటక జట్ల మధ్య అగర్తలలో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ తర్వాత సౌరాష్ట్ర జట్టుతో ఆడాల్సి ఉన్నందున టీమ్ మొత్తం రాజ్‌కోట్‌కు వెళ్లాల్సి ఉంది. అలా మయాంక్ అగర్వాల్ ఢిల్లీ విమానం ఎక్కగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.