2011 World Cup: రోహిత్ను ఆడించాలనుకున్నాం.. కానీ ధోనీ వద్దన్నాడు
X
మహేద్రసింగ్ ధోనీ సారథ్యంలో 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. టీమిండియా రెండోసారి విశ్వవిజేతగా నిలవడంతో సచిన్, యువరాజ్, గంభీర్, ధోనీ, విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు. అయితే కోహ్లీ కంటే ముందు జాతీయ జట్టులోకి వచ్చి, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మకు 2011లో ఛాన్స్ దక్కలేదు. అందుకు చాలా బాధపడ్డానని రోహిత్ చాలాసార్లు చెప్పుకున్నాడు కూడా. అదే అంశం తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. 2008-2012 మధ్య సెలక్షన్ కమిటీలో ఉన్న రాజావెంకట్ మాట్లాడాడు. ఓ స్పోర్ట్స్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు చెప్పుకొచ్చాడు. రోహిత్ ను జట్టులోకి తీసుకోవాలని తాము అనుకున్నా.. ధోనీ పియూష్ చావ్లావైపు మొగ్గు చూపాడని చెప్పుకొచ్చాడు.
‘ప్రపంచకప్ లో రోహిత్ ను సెలక్ట్ చేయాలని అనుకున్నాం. ఆ టైంలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. సెలక్టర్లుగా యశ్ పాల్ శర్మ, నేను అక్కడికి వెళ్లాం. మిగతావాళ్లు చెన్నైలో ఉన్నారు. జట్టులో 15 మందికి చోటు కల్పించాలి. 1 నుంచి 14వ స్థానం వరకు ఎంపిక చేసిన ప్లేయర్స్ ను సెలక్షన్ కమిటీ ఆమోదం తెలిపింది. 15వ ఆటగాడిగా మేం రోహిత్ ను ఎంచుకున్నాం. అప్పటి కోచ్ గ్యారీ కిర్ స్టన్ కూడా సమర్థించాడు. కానీ, ధోనీ మాత్ర దానికి అంగీకరించలేదు. రోహిత్ బదులు పీయూష్ చావ్లాను తీసుకోవాలని పట్టుబట్టాడు. దాంతో కోచ్ కూడా యూటర్న్ తీసుకున్నాడు. దాంతో రోహిత్ వరల్డ్ కప్ కు దూరం అయ్యాడ’ని వెంకట్ చెప్పుకొచ్చాడు. రోహిత్ బదులు జట్టులోకి తీసుకున్న పియూష్ చావ్లా మూడు మ్యాచులాడి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.