ICC Worldcup 2023: ప్లీజ్.. వాళ్లను వరల్డ్కప్కు ఎంపిక చేయొద్దు: కపిల్ దేవ్
X
మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం అవుతుంది. వరల్డ్ కప్ కు ఇంకా 40 రోజులు టైం ఉంది. ఈ క్రమంలో భారత్ ప్రదర్శన, ప్రతీ భారత ఆటగాడి ఫిట్ నెస్ పై అందరి దృష్టి ఉంటుంది. అందరూ రాణించాలని, ఫిట్ గా ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. ప్రస్తుతం గాయాల కారణంగా జట్టుకు దూరమైన కీలక ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆసియా జట్టుకు ఎంపికయ్యారు. ఐర్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా అదరగొట్టాడు. ఇప్పుడున్న బాధంతా రాహుల్, అయ్యర్ ల పైనే. శ్రేయస్ అయ్యర్ కోలుకోగా.. రాహుల్ ఇంకా మోకాలి గాయంతో కొంత ఇబ్బంది పడుతున్నాడు. క్యాంప్ లో ఆడిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన శ్రేయస్.. రాణించాడు. కానీ అనుమానాలన్నీ రాహుల్ పైనే ఉన్నాయి. అందుకే ఆసియా కప్ లో కొన్ని మ్యాచ్ లకు రాహుల్ ను దూరం పెట్టింది బీసీసీఐ. ఈ క్రమంలో ఆటగాళ్ల ఫిట్ నెస్ పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘ఆసియా కప్ కు రాహుల్, శ్రేయస్ ల ఎంపిక సరైందే. వరల్డ్ కప్ కు ముందు ప్రతీ ఆటగాడి ఫిట్ నెస్ తెలుసుకోవల్సిన అవసరం ఉంది. వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్ మంచి వేదిక కూడా. అయితే కొద్ది రోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్ కోసం ప్రతీ ఆటగాడిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫిట్ గా ఉన్న ఆటగాళ్లనే ఎంపిక చేయాల్సి ఉంటుంది. కొంత సమస్య ఉన్నా వాళ్లను ఎంపిక చేసి తప్పు చేయొద్దు. దానివల్ల జట్టు మొత్తం ఇబ్బంది పడుతుంది. అలాగని గాయాలనుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన ఆటగాళ్లను ఎంపిక చేయొద్దని నేను అనట్లేదు. వాళ్లకు అవకాశం ఇవ్వాలి. కానీ, పూర్తి ఫిట్ గా ఉంటేనే వరల్డ్ కప్ కు ఎంపిక చేయాల’ని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.