World Cup 2023: మహాసంగ్రామం నేటి నుంచే మొదలు.. ఫస్ట్ మ్యాచే ఫైనల్ రేంజ్‌లో..
X
ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ నేడు(గురువారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. గత ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే పోరుతో ఈ మహా సంగ్రామం మొదలుకానుంది. దీంతో తొలి మ్యాచే ఫైనల్ మ్యాచ్ రేంజ్‌లో ఉంటుందని క్రికెట్ లవర్స్ అంచనా వేస్తున్నారు.
నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం పది జట్లు ఈ మెగా టోర్నీలో పోటీ పడుతున్నాయి. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనున్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లఖ్‌నవూ, పుణె, బెంగళూరు, ముంబయి, కోల్‌కతాల్లో ఈ మెగాటోర్నీ జరగనుంది. వన్డే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 45 లీగ్ మ్యాచ్‌లు, 3 నాకౌట్ మ్యాచులు ఉంటాయి. 46 రోజుల పాటు సాగనున్న వన్డే ప్రపంచకప్ పోరు.. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది.
ఇక స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని టీమ్‌ఇండియా పట్టుదలగా ఉంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న పోరుతో టీమ్‌ఇండియా తన వేట ప్రారంభించనుంది. వన్డే వరల్డ్‌కప్ 2023 ప్రైజ్‌మనీని.. ICC భారీగా పెంచేసింది. మొత్తం ప్రైజ్ మనీని 83 కోట్ల రూపాయలుగా ప్రకటించింది. ఇందులో వరల్డ్‌కప్ విజేతకు 33 కోట్ల రూపాయలు.. రన్నరప్‌కు 16 కోట్ల రూపాయలు అందనున్నాయి. సెమీ ఫైనల్ చేరిన జట్లకు 6 కోట్లు.. గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు 82 లక్షల రూపాయలు.. గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 33 లక్షల రూపాయల ప్రైజ్‌మనీగా అందుతుంది. వరల్డ్‌కప్‌లో ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ అందనుండటం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది.