బెయిర్ స్టో ఇలాకాలో అలెక్స్ కేరీకి చేదు అనుభవం..షూస్ చూపిస్తూ
X
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో బెయిర్ స్టో వివాదస్పద ఔట్ పై దుమారం ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. మూడో టెస్ట్‌లోనూ బెయిర్ స్టో ఔట్‌పై రచ్చ జరిగింది. బెయిర్ స్టో హోమ్ గ్రౌండ్‌లో అభిమానులు హద్దుమీరారు. ఔట్‌కు కారణమైన ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీని గేలి చేశారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో అలెక్స్ కేరీ ఔటయ్యి పెవిలియన్ వెళ్తున్న సమయంలో పెద్ద ఎత్తున గోల చేశారు. ''గుడ్ బై.. ఇక మైదానంలోకి రాకు.. వస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది'' అని కామెంట్స్ చేశారు. ఈ సమయంలో అందరూ లేచి చప్పట్లు కొట్టారు. ఆసమయంలో కొంత మంది ఫ్యాన్స్ తమ షూస్ తీసి అలెక్స్ కేరీ వైపు చూపెట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వివాదమిదే..
లార్డ్స్ వేదికగా రెండో టెస్టు చివరి రోజు బెయిర్‌స్టోను ఆస్ట్రేలియా ఔట్ చేసిన తీరు వివాదస్పదంగా మారింది. ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో గ్రీన్ తన ఓవర్ చివరి బంతిని బౌన్సర్ వేశాడు. ఆ బాల్‌ను బెయిర్ స్టో వదిలివేయగా కీపర్ అలెక్స్ కేరీ అందుకున్నాడు. ఓవర్ పూర్తైందని భావించిన బెయిర్ స్టో వెంటనే క్రీజ్ వదిలి ముందుకు నడిచాడు. అదును చూసి ఆస్ట్రేలియా కీపర్ వికెట్లను కొట్టడంతో అంపైర్ దానిని ఔట్‌గా ప్రకటించాడు. కీలక సమయంలో బెయిర్ స్టోను ఆస్ట్రేలియా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఔట్ చేయడంపై వివాదం చెలరేగింది. దీంతో ఆసీస్ ‘క్రీడా స్ఫూర్తి’ ప్రదర్శించలేదని ఇంగ్లాండ్ అభిమానులు విమర్శలు గుప్పించారు. తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే ఔట్ చేసినట్లు ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు కౌంటర్ ఇచ్చారు. ఈ అంశంపై మాజీ ఆటగాళ్ల నుంచి కూడా భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.