IND vs ENG: అదే సీన్ రిపీట్.. ఒకే రీతిలో ఐదుగురు ఔట్.. మన తప్పు ఇంగ్లాండ్కు ప్లస్ అయింది
X
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజులు ఇంగ్లాండ్ పై భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతూ.. మ్యాచ్ లో పట్టుబిగిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా.. 7 వికెట్ల నష్టానికి 421 పరగులు చేసింది. ప్రస్తుతం 175 పరుగుల ఆధిక్యంలో మూడో రోజు ఆటను కొనసాగించనుంది. తొలి రోజు 119, రెండో రోజు 302 పరుగులు చేసింది టీమిండియా. కేఎల్ రాహుల్ (86), జడేజా (81 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. శ్రేయస్ అయ్యర్ (35), కేఎస్ భరత్ (41) పరవాలేదనిపించారు. స్కోర్ పరంగా భారత్ మెరుగైన ప్రదర్శనే కనబరిచినా.. బ్యాటర్ల తీరు తీవ్ర నిరాశ పరిచింది. మన బ్యాటర్ల తప్పను ప్లస్ చేసుకున్న ఇంగ్లాండ్ ఏకంగా ఐదుగురు బ్యాటర్లను ఒకే రీతిలో ఔట్ చేసి, భారత్ ను ఇబ్బంది పెట్టింది.
ఒక్క తప్పు చేస్తూ వికెట్లు పారేసుకుంటున్నారు. దాంతో కేఎల్ రాహుల్, యశస్వీ జైశ్వాల్ సెంచరీలు మిస్ చేసుకోగా.. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ ను చేయలేకపోయారు. తొలిరోజు 13వ ఓవర్ లో భారీ సిక్స్ కొట్టబోయిన రోహిత్ శర్మ జాక్ లీచ్ బౌలింగ్ లో బెన్ స్టోక్స్ కు దొరికిపోయాడు. 24 ఓవర్ లో భారీ షాట్ ఆడబోయిన జైశ్వాల్ జో రూట్ కు క్యాచ్ ఇచ్చాడు. గిల్ ది కూడా అదే తీరు. క్రీజులో నిలదొక్కుకుని బౌండరీల ద్వారా స్కోర్ రాబట్టిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లు కూడా అచ్చం అదే రీతిలో ఔట్ అయ్యారు. శ్రేయస్.. 53వ ఓవర్ లో రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో సిక్స్ కొట్టబోయి టామ్ హార్ట్లీకి దొరికిపోయాడు. 65వ ఓవర్‌లో టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి రెహాన్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చాడు రాహుల్. దీంతో క్రికెట్ ఎక్స్ పర్ట్స్ భారత బ్యాటర్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు, క్రీజులో కుదురుకున్న బ్యాటర్లు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లి, భారీ స్కోర్ చేయాల్సింది పోయి.. ఇలా ఒకే రీతిలో వికెట్లు పారేసుకోవడం ఏంటి? కోచ్ ఇది గమనిస్తున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు.