భారత్‌లో పాక్ జట్టు పర్యటించే విషయంపై కమిటీ ఏర్పాటు..
X
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అన్ని ప్రధాన జట్లు వన్డే వరల్డ్ కప్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దాయాది పాకిస్థాన్ మాత్రం ఇండియాకు వచ్చి ప్రపంచ కప్ ఆడడంపై ఇంకా క్లారిటీ రాలేదు. వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై అనుమతి కోరుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి క్రికెట్ బోర్డు లేక రాసిన తర్వాత కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచకప్ కోసం భారత్‌లో పాక్ పర్యటించే విషయంపై పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో వేసిన కమిటీలో క్రీడల మంత్రి అహ్సాన్ మజారీ, న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి ఆజం నజీర్ తరార్, మర్యం ఔరంగజేబ్, అసద్ మహమూద్, అమీన్ ఉల్ హక్, కమర్ జమాన్ కైరా, మాజీ దౌత్యవేత్త తారిఖ్ ఫాత్మీ, తదితరులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. భారత్-పాకిస్థాన్‌లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ చర్చించి తుది నివేదికను ప్రధానికి అందించనుంది.
వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో రెండు వార్మప్ మ్యాచ్‌లు పాక్ ఆడనుంది. తర్వాత నెదర్లాండ్స్, శ్రీలంకపై హైదరాబాద్ వేదికగానే తలపడనున్నారు. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదిక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీంతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో బెంగళూరులో రెండు, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కోల్‌కతాలో రెండు, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో చెన్నైలో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే కోల్‌కతాలో ఆడనుంది. అయితే షెడ్యూల్‌ను ప్రకటించకముందే, అహ్మదాబాద్‌లో ఆడటంపై పిసిబి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. బెంగుళూరులో ఆస్ట్రేలియా, చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్ ఆడేందుకు కూడా వారు నిరాకరిస్తున్నారు. పాకిస్థాన్ మ్యాచ్‌లు జరిగే వేదికలను పరిశీలించేందుకు అత్యున్నత స్థాయి భద్రతా బృందాన్ని భారత్‌కు పంపాలని సంబంధిత మంత్రులు పీసీబీకి ఇప్పటికే సూచించారు.