బుమ్రా క్రికెట్ ఆడాలంటే.. ఇప్పుడు రిటైర్ అవ్వాలి: ఆస్ట్రేలియా మాజీ
X
జస్ప్రిత్ బుమ్రా.. ప్రపంచంలోని ఏ దిగ్గజ బ్యాట్స్ మెన్ అయినా.. ఇతని బౌలింగ్ లో ఇబ్బంది పడాల్సిందే. బుమ్రా పర్ఫెక్ట్ లెంత్, డెడ్లీ పేస్, టెక్నిక్, యార్కర్లతో భయపెట్టాడు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లో బుమ్రాను గాయాలు వెంటాడాయి. చాలాకాలం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం కోలుకుని నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్న బుమ్రా.. త్వరలోనే గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు బుమ్రాను కెప్టెన్ చేస్తూ జట్టులో చోటిచ్చింది బీసీసీఐ. తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న బుమ్రా కెరీర్ పై ఆస్ట్రేలియా దిగ్గజం మెక్ గ్రాత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే ఏదో ఒక ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని సూచించాడు. ‘బుమ్రా నా ఫేవరెట్ బౌలర్. తనకు నేను పెద్ద ఫ్యాన్ ని. అతని భిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాకపోతే.. అదే అతనికి ఇబ్బందులకు గురిచేస్తోంది. అతని బౌలింగ్ శైలి వల్ల శరీరంపై తీవ్రభారం పడుతుంది. దానివల్లే తరచూ ఫిట్ నెస్ కోల్పోతున్నాడు. ప్లేయర్లకు గాయాలవ్వడం కామన్. అయితే, తరచూ ఒకే విధంగా ఫిట్ నెస్ కోల్పోతుంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సుధీర్ఘ కెరీర్ ను కొనసాగించాలంటే ప్రస్తుతం బుమ్రా ఒక ఫార్మట్ నుంచి తప్పుకోవాల’ని మెక్ గ్రాత్ సూచించాడు.