Hardik Pandya : క్రికెట్ బోర్డ్పై హార్దిక్ ఫైర్.. ‘మా అవసరాలైనా తీర్చాలిగా’ అంటూ అసంతృప్తి
X
గతంలో మేటి జట్టు. ప్రత్యర్థులకు ఆ జట్టంటే హడల్. సిరీస్ గెలవడం అటుంచితే.. వాళ్ల బౌలింగ్ లో గాయాలవకుండా చూసుకోవడానికి సరిపోయేది. వరుస వరల్డ్ కప్ విజయాలు.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులు క్రియేట్ చేసిన గొప్ప ఆటగాళ్లు.. ఇలా వెస్టిండీస్ టీం గురించి చెప్పాలంటే.. ఒకప్పటి మాటలే గుర్తొస్తాయి. అంతటి కీర్తి పొందిన జట్టు ప్రస్తుతం దీన స్థితిలో ఉంది. క్రికెట్ బోర్డ్ ఎంతటి దయనీయ పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. ఆటగాళ్లకు జీతాలివ్వడం లాంటి సమస్యలను పక్కనపెడితే.. ఏ విషయంలోనూ విండీస్ క్రికెట్ బోర్డ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. బోర్డ్ మేనేజ్మెంట్ కనీసం స్టేడియాలను పట్టించుకోవడం, అతిథ్యానికి వచ్చిన ఆటగాళ్లకు కనీస అవసరాలు కల్పించడం లాంటివి చేయలేక ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటుంది.
తాజాగా విండీస్ తో టీమిండియా వన్డే సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. చివరి వన్డేలో గెలిచిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. విండీస్ క్రికెట్ బోర్డ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘మేము విలాసాలు కావాలని కోరుకోవడం లేదు. కనీసం సౌకర్యాలు తీర్చితే చాలు. వాటిని తీర్చడంలో విండీస్ బోర్డ్ దారుణంగా విఫలం అయింది. ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఇలానే ఫీల్ అయ్యాం. ఇకనైనా పరిస్థితులు మెరుగవుతాయని ఆశించాం. కానీ ఇక్కడ ఏదీ మారలేదు. స్టేడియాలు, పిచ్ లు, వసతులు ఇలా అన్నింట్లో ఫెయిల్ అయ్యారు. ఆటగాళ్ల కనీస అవసరాలు తీర్చకుంటే ఎలా. మళ్లీ వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నా’ అంటూ విండీస్ బోర్డ్ పై విమర్శలు గుప్పించాడు.