Home > క్రీడలు > సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ..

సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ..

సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ..
X

టీమ్‌ ఇండియా టెస్టు క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ (Mohd Azharuddin)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసుకు హైకోర్టుకే వెళ్లి సమాధానం ఇవ్వాలని అజారుద్దీన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌(NDCA)కు, హెచ్‌సీఏ (HCA)కు మధ్య 2022 నాటి వివాదంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ఆధ్వర్యంలో సాగే లీగ్‌ మ్యాచ్‌ల్లో నల్గొండ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ (NDCA) జట్టు ఆడేందుకు గతంలో అధ్యక్షునిగా ఉన్న అజారుద్దీన్‌ నిరాకరించారు. ఎన్‌డీసీఏ హైకోర్టును ఆశ్రయించడంతో లీగ్‌ మ్యాచ్‌ల్లో ఎన్‌డీసీఏ జట్టును ఆడేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను హెచ్‌సీఏ ఉల్లంఘించడంతో హైకోర్టు అజారుద్దీన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్‌ చేస్తూ అజారుద్దీన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ధిక్కార నోటీసుపై అజారుద్దీన్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇది కేవలం ధిక్కరణ నోటీసును వ్యతిరేకిస్తూ చేసిన అభ్యర్థన మాత్రమేనని.. ఈ దశలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో అజహరుద్దీన్‌ పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయమూర్తులు బిఆర్‌ గవాయ్‌ , ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విముఖత చూపింది. ‘హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ధిక్కరణకు పాల్పడలేదా’ అని ప్రశ్నించగా ‘లేదు’ అని అజారుద్దీన్‌ తరఫు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘అయితే మంచిది. హైకోర్టుకు వెళ్లి అదే సమాధానం చెప్పండి’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ పిటిషన్‌ ఉపసంహరణకు అజారుద్దీన్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో అందుకు అంగీకరించిన ధర్మాసనం కేసు విచారణను ముగించింది.

Updated : 23 July 2023 9:00 AM IST
Tags:    
Next Story
Share it
Top