Hyderabad Womens Coach: హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్య ప్రవర్తన.. కోచ్ సస్పెండ్!
X
హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ జై సింహాపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సస్పెన్షన్ వేటు వేసింది. టీమ్ బస్సులో జై సింహ మద్యం సేవించిన దృశ్యాలు వాట్సాప్ గ్రూపులు, టీవీ చానెళ్లలో వైరల్ అయ్యాయి. దాంతో, అతడిపై తక్షణమే వేటు వేస్తున్నట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు (Jaganmohan Rao) ఓ ప్రకటనలో తెలిపారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు పెడతాం అని తెలిపారు.
‘జై సింహ మద్యం సేవించిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. అనంతరం అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదు. విచారణ ముగిసేంతవరకు జై సింహను సస్పెండ్ చేస్తున్నాం. హెచ్‌సీఏకు సంబంధించిన కార్యక్రమాల్లో జై సింహా పాల్గొనకూడదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాం’ అని జగన్ వెల్లడించారు.
కోచ్ జై సింహాపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు జనవరిలో లేఖ రాశారు. జై సింహాకు పలువరు అండగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. జై సింహా తాగుడుకు బానిస అయ్యాడు. తమ ముందు మద్యం తాగొద్ధని పలుమార్లు మహిళా ప్లేయర్స్ వారించినా వినలేదు. తనను ప్రశ్నిస్తే టీంలో నుండి తీసేస్తామని బెదిరింపులు గురిచేవాడు. బీసీసీఐకి కూడా మహిళా క్రికెట్ ప్లేయర్స్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నెల రోజుల తరువాత హెచ్‌సీఏ స్పందించింది.