IND vs SL Asia Cup 2023 Final: ఆఖరి పోరుకు సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు
X
మూడు వారాల క్రితం మొదలైన ఆసియా కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. లీగ్ దశ మ్యాచ్‌లు, సూపర్ 4 పోటీలు ముగించుకొని చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది. 6 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్, శ్రీలంకలు ఫైనల్ చేరాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం టైటిల్ పోరు హోరాహోరీగా సాగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు శ్రీలంకపై మాత్రమే ఫైనల్‌లో ఓడిపోయింది. గత 15 ఆసియా కప్ టోర్నీల్లో టీమ్ ఇండియా మొత్తం 10 సార్లు ఫైనల్ ఆడింది. ఫైనల్‌లో మూడుసార్లు ఓడిపోయింది. అది కూడా శ్రీలంకపైనే కావడం.. ప్రస్తుతం రోహిత్ శర్మను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా శ్రీలంక(13 సార్లు) ఉంది. తర్వాతి స్థానంలో భారత్(11) నిలిచింది. అయితే భారత్ ఇప్పటివరకు 7 సార్లు టోర్నీని సొంతం చేసుకోగా.. శ్రీలంక ఆరు టైటిళ్లను సాధించింది. ఆసియా కప్‌లో ఇరు జట్లు 22 మ్యాచుల్లో తలపడగా చెరో 11 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్, శ్రీలంక జట్లు 8 సార్లు తలపడ్డాయి. భారత జట్టు 5 సార్లు గెలుపొందగా, శ్రీలంక జట్టు 3 సార్లు గెలుపొందింది. ఈ లెక్కల ప్రకారం నేడు జరగనున్న ఫైనల్ సైతం హోరాహోరీగా సాగుతుందనే అంచనాలు ఉన్నాయి.
గత మ్యాచ్‌లో (సూపర్-4 ఆఖరి మ్యాచ్) 5 మార్పులతో బరిలోకి దిగి అనూహ్యంగా ఓటమిపాలైన భారత్.. తుది పోరులో మాత్రం పూర్తి జట్టుతో బరిలోకి దిగనుంది. ఆసియా కప్ టోర్నీ సొంతం చేసుకొని వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని భారత్ భావిస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గిల్, అక్షర్ పటేల్ మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌కు కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులోకి రానుండటంతో బ్యాటింగ్ యూనిట్ బలంగా మారనుంది. బుమ్రా, సిరాజ్‌లు సైతం ఆడనున్నారు. గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లి, రాహుల్, ఇషాన్/తిలక్, హార్దిక్, జడేజా, శార్దూల్/సుందర్, కుల్‌దీప్, బుమ్రా, సిరాజ్.
శ్రీలంక: నిశాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, శానక, ధనంజయ డిసిల్వా, వెల్లలాగె, హేమంత, రజిత, పతిరన.