AFG vs NZ : ఆఫ్ఘనిస్తాన్‌తో నేడు న్యూజిలాండ్ బిగ్ ఫైట్
X
ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్.. ఈరోజు మధ్యాహ్నం(2 గంటలకు) న్యూజిలాండ్ ను ఢీకొట్టబోతోంది. మరోవైపు ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్ లలో విజయం సాధించిన న్యూజిలాండ్ మరో విజయంపై కన్నేసింది. వరల్డ్ కప్ లో ఇది 16వ మ్యాచ్. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా, 3 మ్యాచ్ లకుగానూ ఒక్కటి నెగ్గిన అఫ్గాన్ 6వ స్థానంలో నిలిచింది. అఫ్గాన్ పై నెగ్గితే 8 పాయింట్లతో అగ్ర స్థానం కివీస్ దే.
వన్డే ప్రపంచకప్ విషయానికొస్తే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు రెండుసార్లు తలపడగా, 2 మ్యాచ్ ల్లోనూ కివీస్ విజయం సాధించి 2-0 తో పైచేయి సాధించింది. కానీ 2019 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్ ను ఓడించిన తరువాత అఫ్గాన్ జట్టును మరే జట్టు అంత తేలికగా తీసుకోలేదని చెప్పొచ్చు. అఫ్గాన్ చిన్నజట్టుగా కనిపించినా, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణిస్తూ పెద్ద జట్లను ఇబ్బంది పెడుతోంది.
న్యూజిలాండ్ జట్టులో గాయం కారణంగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ 4వ మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఇదివరకే మెగా టోర్నీలో తొలి 2 మ్యాచ్ లకు దూరమైన విలిమయ్సన్ అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో మరోసారి గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ (107 బంతుల్లో 78 రన్స్) తరువాత చేతి బొటనవేలికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. మరోసారి గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో చెన్నైలో బుధవారం జరగనున్న మ్యాచ్ కు విలియమ్సన్ కు విశ్రాంతి ఇచ్చారు. అయితే విలియమన్సన్ లేకున్నా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్ లు బ్యాటింగ్ ఇరగదీస్తున్నారు. బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీలు మంచి ఫలితాలు రాబడుతున్నారు. అటు అఫ్గాన్ జట్టులో బౌలింగ్ లో మెరుపులు మెరిపిస్తూ అగ్రజట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. రషీద్, నబీ, ముజీబుర్ రెహ్మాన్ లాంటి బౌలర్లు వికెట్లతో రాణిస్తుండగా.. బ్యాటింగ్ లో గుర్బాజ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
జట్ల అంచనా..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, డీజే మిచెల్, రచిన్ రవీంద్ర, ఎంఎస్ చాప్ మన్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, ఫెర్గూసన్, ఎంజే హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి.
ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, ఆర్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్ జాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఐఏ ఖిల్, రషీద్ ఖాన్, ముజీబుర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీన్ -ఉల్-హక్.