IND vs AFG: తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ
X
యువ ఆటగాళ్లు అదరగొట్టారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే హాఫ్ సెంచరీ(50 పరుగులు)తో అదరగొట్టగా, జితేశ్ శర్మ 31 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దూబేకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జనవరి 14న జరగనుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున మహ్మద్ నబీ 42 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ లో ఫజల్హక్ ఫరూఖీ వేసినమొదటి బంతిని డిఫెన్స్ ఆడిన రోహిత్, రెండో బంతిని మిడ్ ఆఫ్ మీదుగా కొట్టాడు. ఆ తర్వాత రోహిత్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ స్పందించలేదు. బాల్ వైపు చూస్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోనే ఉండిపోయాడు. అదే టైంలో మిడ్ ఆఫ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్ మెరుపు వేగంతో బంతిని అందుకుని కీపర్ కు విసిరాడు. దీంతో రోహిత్ రన్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మైదానాన్ని వీడుతున్న రోహిత్, గిల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ తర్వాత కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన గిల్ అదే జోరులో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడటంలో తడబడిన తిలక్ వర్మ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దూబే, జితేశ్ పార్టనర్‌షిప్ జట్టును గెలుపు దిశగా నడిపించింది. అఫ్గాన్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్‌కు సానుకూలంగా మారింది. జితేశ్ వెనుదిరిగినా... రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో దూబే మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.