IND vs BAN: నేడు బంగ్లాతో భారత్ మ్యాచ్..
X
వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. మహా సంగ్రామంలో నేడు బంగ్లాదేశ్‌తో నాలుగో మ్యాచ్‌లో తలపడనుంది. పూణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభంకానుంది. సెమీస్‌కు మార్గం సుగుమం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ కీలకం కావడంతో రోహిత్ సేన అలసత్యానికి చోటివ్వకుండా గెలవాలని చూస్తోంది. మరోవైపు గత మ్యాచుల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోరంగా ఓటమి పాలైన బంగ్లా.. ఈసారైనా గెలవాలని బలంగా కోరుకుంటోంది. గత నాలుగు వన్డేల్లో మూడుసార్లు టీమిండియాను బంగ్లాదేశ్ ఓడించింది.
ఆసియా కప్ 2023 సూపర్-4లో భారత్‌కు బంగ్లాదేశ్ చేతిలో పరాభవం ఎదురైంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా. కానీ ఈ మ్యాచ్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగే బంగ్లాను తక్కువ అంచనా వేస్తే టీమిండియా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎలాంటి సమయంలోనైనా ప్రత్యర్థి జట్లకు షాక్ ఇవ్వగలిగే సత్తా బంగ్లా సొంతం. కాబట్టి ఆ జట్టును తక్కువగా అంచనా వేయకుండా బరిలో చెలరేగాల్సి ఉంటుంది. అఫ్గానిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్.. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో ఇప్పుడు భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్, గిల్, విరాట్, కేఎల్ రాహుల్, శ్రేయస్ కూడిన బ్యాటింగ్ విభాగం ఫుల్‌ఫామ్‌తో ఉంది. ఆల్‌రౌండర్లు హార్దిక్, రవీంద్ర జడేజా సమయానికి తగ్గట్టుగా వికెట్లను అందిస్తూ సహకారం ఇస్తున్నారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని రోహిత్ సేన ప్రణాళిక రచిస్తోంది. వన్డేల్లో ఈ వేదికపై ఏడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచుల్లో గెలిచి.. మూడింట్లో ఓడిపోయింది.
మరోవైపు ఈ ప్రపంచ కప్‌లో మరొక విజయాన్ని నమోదు చేయాలని బంగ్లా పట్టుదలగా ఉంది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాలని జట్టు కోరుకుంటోంది. ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లో గెలచిన బంగ్లా... తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కూడా ఓడితే బంగ్లా సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్‌ల రాణిస్తారని బంగ్లా జట్టు ఆశలు పెట్టుకుంది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా , శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్.
బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, మహిదీ హసన్, తస్కిన్ అహ్మద్ ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.