55 రన్స్కు శ్రీలంక ఆలౌట్.. సెమీస్కు దూసుకెళ్లిన టీమిండియా
X
వరల్డ్ కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా తాజాగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకతోను 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. 358 పరుగుల లక్ష్య చేధినలో లంక ప్లేయర్లు ఫస్ట్ బాల్ నుంచే తడబడ్డారు. నిప్పులు చెరిగిన భారత బౌలర్ల ధాటికి శ్రీలంక కకావికలమైంది. లంక బ్యాటర్లలో ఐదుగురు ఒక్క పరగు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. భారత ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ రికార్డు విజయంతో భారత్ సెమీస్కు చేరింది.
శ్రీలంక బ్యాటర్ కాసున్ రజిత (14) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. మాథ్యూస్ (12), తీక్షణ (12) రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమతమయ్యారు. కుశాల్ (1), అసలంక (1) పరుగులకు పెవిలియన్ బాట పట్టగా.. మధుశంక (5) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిశాంక, కరుణరత్నె, సమర విక్రమ, హేమంత, దుష్మంత చామిర ఒక్క పరుగు కూడా చేయలేదు. భారత బౌలర్లలో షమి 5, సిరాజ్ 3, బుమ్రా, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అదరగొట్టింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (4) పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92, విరాట్ కోహ్లీ 88 (94 బంతుల్లో 11 ఫోర్లు) రన్స్ చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్, శుభ్మన్ గిల్ ఇద్దరూ సెంచరీలకు చేరువలో పెవిలియన్ బాట పట్టారు. శ్రేయస్ అయ్యర్ 56 బాల్స్ లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు కొట్టి 82 రన్స్తో భారీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా స్కోరు 300 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ 21 (19 బంతుల్లో 2 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ 12 (9 బంతుల్లో 2 ఫోర్లు) రన్స్ చేశాడు. 4 బంతులాడి 2 రన్స్ చేసిన షమీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. లాస్ట్ బాల్కు రవీంద్ర జడేజా 34(23) రనౌట్‌గా వెనుదిరగగా, బూమ్రా 1(1) నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5, దుష్మంత చమీర ఒక వికెట్ తీశారు