IND vs PAK: టీమిండియా బౌలర్ల దాడి.. కుప్పకూలిన పాకిస్తాన్
X
భారత్, పాక్ మ్యాచ్ అంటే.. ఓ మినీ వార్ ను తలపిస్తుంది. ఒకరిపై మరొకరి ఆధిపత్యం, స్లెడ్జింగ్.. చివరికి టీమిండియా గెలుపు. అభిమానులు కూడా ఇదే కోరుకుంటారు. అందుకే ప్రతీ టోర్నీలో ఈ జట్ల మధ్య మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తారు. అయితే ఇవాళ అహ్మదాబాద్ వేదికపై జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో అవేవీ కనిపించలేదు. మొదటి 25 ఓవర్లు మినహా బ్యాటింగ్ లో పాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. టీమిండియా బౌలర్ల ఎదురుదాడికి పాక్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో.. 42.5 ఓవర్లలో 191 పరుగులకే పాకిస్తాన్ ఆలౌట్ అయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్.. 30 ఓవర్ల వరకు భారత్ కు కాస్త పోటీ ఇచ్చింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్ షఫిక్ (20, 24 బంతుల్లో), ఇమామ్ ఉల్ హక్ (36, 38 బంతుల్లో) మంచి ఆరంభం అందించినా.. పార్ట్నర్షిప్ ను కొనసాగించలేకపోయారు. సిరాజ్, అబ్దుల్ ను ఎల్బీడబ్ల్యూ చేయగా.. వరుస బౌండరీలు బాదుతూ జోరుమీదున్న ఇమామ్ ను హార్దిక్ ఔట్ సైడ్ హాఫ్ స్టంప్ బాల్ తో పెవిలియన్ కు పంపించాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం (50, 58 బంతుల్లో), రిజ్వాన్ (49, 69 బంతుల్లో) మూడో వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా బాబర్ కు ఈ వరల్డ్ కప్ లో మొదటి హాఫ్ సెంచరీ. తర్వాత బాబర్, రిజ్వాన్ తో కలిసి భారీ స్కోర్ దిశగా భాగస్వామ్యాన్ని తీసుకెళ్తున్న టైంలో.. బాబర్ ను బౌట్ చేసిన సిరాజ్, పాకిస్తాన్ కు బ్రేక్ ఇచ్చాడు.
33వ ఓవర్లో కుల్దీప్ వరుస వికెట్లతో పాక్ ను కష్టాల్లో నెట్టాడు. బాబర్ తర్వాత వచ్చిన సౌద్ షకీల్ (6, 10 బంతుల్లో), ఇఫ్తికర్ అహ్మద్ (4, 3 బంతుల్లో) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కుల్దీప్ వేసిన 33 ఓవర్లో షకీల్ ఎల్బీడబ్ల్యూ కాగా, ఇఫ్తికర్ బౌల్డ్ అయ్యారు. ఇక అప్పటినుండి పాక్ పతనం ప్రారంభం అయింది. వచ్చిన ఏ బ్యాటర్ క్రీజులో నిల్వలేకపోయారు. ఏ బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. హసన్ అలి (12) మినహా ఏ బ్యాటర్ రెండంకెల స్కోర్ చేయలేదు. టీమిండియా కీలక మ్యాచ్ లో రాణించారు. కీలక సమయాల్లో పాక్ పై ఒత్తిడితెచ్చి తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్, హార్దిక్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.