IND vs AFG: వరల్డ్రికార్డ్.. ఉత్కంఠ పోరులో అఫ్గాన్‌పై భారత్ విజయం
X
బుధవారం అఫ్గాన్ తో జరిగిన టీమిండియా ఆఖరి టీ20.. క్రికెట్ లవర్స్‌కి మస్త్ కిక్ ఇచ్చింది. నాలుగు గంటలపాటు అటు స్టేడియంలోనూ, ఇటు టీవీల ముందూ కూర్చున్న ప్రేక్షకులను.. ఆఖరి వరకూ ఊరిస్తూ.. అద్భుతాన్ని చూపెట్టింది. అవును మరి.. ప్రపంచ కప్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా.. సస్పెన్స్, థ్రిల్లర్‌గా మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20 లో... భారత జట్టు రెండో సూపర్ ఓవర్లో అఫ్గాన్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. పరుగుల వరద పారిన పోరులో విజేతను తేల్చేందుకు ఏకంగా రెండు సూపర్ ఓవర్లు అనివార్యమయ్యాయి. అయితే రెండో సూపర్ ఓవర్లో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాకు ఉత్కంఠ విజయం అందించాడు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. రోహిత్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా, దూబే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచారు.
ఆకాశమే హద్దుగా భారీ షాట్లు..
నిజానికి.. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (4), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. గత రెండు మ్యాచ్‌ల్లో హీరో శివమ్ దూబే కూడా (1) స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడు. ఇక మళ్లీ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్ (0) మరోసారి నిరాశపర్చాడు. ఎదుర్కొన్న తొలి బంతినే గాల్లోకి లేపి క్యాచౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. భారత జట్టు 120 పరుగుల మైలురాయిని దాటడం కూడా కష్టమేనని అనుకున్నారు. కానీ.. ఆ అంచనాలని బోల్తా కొట్టిస్తూ రోహిత్, రింకూ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. మొదట్లో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత సిక్సులు,ఫోర్లతో చెలరేగారు. భారీ షాట్లతో ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరివరకూ క్రీజులోనే నిల్చొని.. ఆకాశమే హద్దుగా దుమ్ముదులిపేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 121 నాటౌట్) సెంచరీతో, డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్ (39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో వాహ్వా అనిపించారు. తొలుత టీమిండియా 20 ఓవర్లలో 212/4 స్కోరు చేసింది.
వణికించిన అఫ్గాన్
ఈ తర్వాత లక్ష్య ఛేదనకై బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు కూడా.. టీమిండియాను ఒక దశలో వణికించింది. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం భారత బౌలర్లను బెంబేలెత్తిస్తూ, తొలి వికెట్‌కు ఏకంగా 93 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్‌లో సుందర్ పట్టిన సూపర్ క్యాచ్‌తో గుర్బాజ్ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆపై రెండు వికెట్లను వెంటవెంటనే చేజార్చుకున్నా..నబీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో మరోసారి ఆతిథ్య జట్టులో గుబులు రేపాడు. నబీ ఇన్నింగ్స్‌కు సుందర్ ముగింపు పలికినా..చివరి బ్యాటర్లు జతగా గుల్బదిన్ నైబ్ అఫ్ఘానిస్థాన్‌ను గెలుపు అంచులదాకా తీసుకొచ్చాడు. ఆఖరి ఓవర్లో అఫ్ఘాన్ విజయానికి 19 పరుగులు చేయాల్సి వచ్చింది. ముకేశ్ వేసిన ఆ ఓవర్లో గుల్బదిన్ 4,6 కొట్టడంతో ఆఖరి బంతికి మూడు పరుగులుగా సమీకరణం మారింది. కానీ గుల్బదిన్ రెండు పరుగులే తీయడంతో మ్యాచ్ టై అయింది.
చరిత్ర సృష్టించిన భారత్
సరిగ్గా 20 ఓవర్లు ముగిసే సరికి ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో ఫస్టు బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. 16 పరుగులు చేసింది. ముకేశ్ కుమార్ ఈ ఓవర్ వేశాడు. ఆ తర్వాత భారత్ తరఫున బరిలోకి దిగిన ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ లు.. తొలి రెండు బంతులకు ఒక్కో పరుగు చొప్పున రెండు పరుగులు చేశారు. ఆ తర్వాత రెండు బంతులని సిక్సర్‌గా మలిచాడు హిట్ మ్యాన్. ఐదో బంతికి సింగిల్ రావడంతో యశస్వి జైశ్వాల్ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. ఈ బంతికి రెండు పరుగులు చేస్తే భారత్‌దే విజయం. అయితే ఇక్కడే కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్ట్ హర్ట్‌గా పెవిలియన్ చేరి.. రింకూ సింగ్‌ను నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోకి పంపించాడు. కానీ, కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. మరోసారి స్కోర్లు సమం కావడంతో అంపైర్లు మరో సూపర్ ఆడించాలని నిర్ణయించారు. రెండవ సూపర్ ఓవర్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రోహిత్ శర్మకు తోడుగా రింకూ సింగ్ వచ్చాడు. తొలి బంతికి సిక్స్, రెండో బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ.. మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బంతికి రింకూ సింగ్ ఔట్ కాగా.. సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. శాంసన్ భారీ షాట్ ఆడాలని ప్రయత్నించినా బంతి మిస్ అయి నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. పరుగు కోసం ప్రయత్నించి రోహిత్.. రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ సూపర్ ఓవర్-2లో 11 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగింది అఫ్గాన్ జట్టుకి .. భారత బౌలర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ గట్టి షాక్ ఇచ్చాడు. తొలి బంతికే నబీని ఔట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి గుర్బాజ్‌ను పెవిలియన్ చేర్చాడు. సూపర్ ఓవర్లో 2 వికెట్లు పతనమైతే ఆలౌట్ అయినట్టు లెక్క. దీంతో భారత్ 10 పరుగుల తేడాతో (రెండో సూపర్ ఓవర్) గెలుపొందింది. సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తో విజయం సాధించిన భారత్ .. టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా నిలిచింది.
హిస్టరీ క్రియేట్ చేసిన హిట్ మ్యాన్
ఈ మ్యాచ్ తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 5 సెంచరీలు(అత్యధిక సెంచరీలు)సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు.. టీ20ల్లో అతనికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యి నిరాశపరిచినా రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి, ఆ ఆకలిని తీర్చుకున్నాడు. ఏ రికార్డులైనా తాను దిగనంత వరకేనని ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ రోహిత్ చాటిచెప్పాడు. హిట్‌మ్యాన్ ధనాధన్ బ్యాటింగ్‌తో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం రోహిత్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది. కాకపోతే.. విరాట్ కోహ్లీ డకౌట్ అవ్వడమే ఈ మ్యాచ్‌లో నిరాశపరిచే విషయం.