IND vs ENG 3rd Test: టాస్ గెలిచిన టీమిండియా.. మరికాసేపట్లో బ్యాటింగ్ మొదలు
X
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న భారత్, ఇంగ్లండ్ జట్ల మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై తిరుగులేని టీమిండియా అనూహ్యంగా తొలి టెస్టులో ఓడింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా...రెండో టెస్టులో భారత్‌కు భారీ విజయం దక్కింది. అయితే గత పర్యటనతో పోలిస్తే ఇంగ్లండ్ కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా...భారత్ కోణంలో చూస్తే అనూహ్యంగా గట్టి పోటీ ఎదురైంది. పిచ్‌లు మరీ ఎక్కువగా స్పిన్‌కు సహకరించని నేపథ్యంలో రెండు జట్ల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాజ్‌కోట్ ఏ జట్టు ఆధిపత్యం కనబర్చుతుందో చూడాలి. మ్యాచ్ ఈ ఉదయం 9.30కు ఆరంభం అవుతుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్షప్రసారం అవుతుంది.
టీమిండియాను మిడిల్ ఆర్డర్ ప్రదర్శన ఆందోళనకు గురిచేస్తోంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో ఇబ్బంది పడుతోన్న భారత్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ దూకుడైన ఆట పెద్దగా ఫలితాలనివ్వట్లేదు. దాంతో సంయమనంతో ఆడడంపై రోహిత్ దృష్టిపెట్టే అవకాశముంది. ఈ మ్యాచ్ లో రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ , కీపర్ కేఎస్ భరత్ వైఫల్యం కారణంగా ధ్రువ్ జురెల్ ఆడుతున్నారు. విరాట్ స్థానంలో రజత్ పటీదార్ ఆడతాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా ఫామ్ టీమిండియాకు కలిసొచ్చే అంశం. జడేజా, అశ్విన్‌లకు తోడుగా కుల్దీప్ మూడో స్పిన్నర్‌గా ఆడే అవకాశాలు ఉన్నాయి.
గత టెస్టులో ఓడినప్పటికీ ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న రాజ్‌కోట్ పిచ్‌పై బజ్‌బాల్ వ్యూహాన్ని కొనసాగించాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. తొలి రెండు టెస్టుల్లో ఒకే పేసర్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఈసారి ఇద్దరు పేసర్లను ఆడిస్తోంది. స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను తప్పించి.. మార్క్ వుడ్‌కు చోటు కల్పించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. బెన్ స్టోక్స్‌కు ఇది 100వ టెస్టు కావడం విశేషం. ఇంగ్లండ్ తన తుది జట్టును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం అయినా.. తర్వాత స్పిన్‌కు సహకరిస్తుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, జైస్వాల్, గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్ : క్రాలీ, డకెట్, ఒలీ పోప్, జో రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, ఫోక్స్, రెహాన్ అహ్మద్, హార్ట్‌లీ, మార్క్ వుడ్, అండర్సన్.