Home > క్రీడలు > India vs New Zealand: రసవత్తర సమరానికి రంగం సిద్ధం

India vs New Zealand: రసవత్తర సమరానికి రంగం సిద్ధం

India vs New Zealand: రసవత్తర సమరానికి రంగం సిద్ధం
X

ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు తన ఐదోమ్యాచ్‌ను నేడు న్యూజిలాండ్‌తో ఆడనున్నది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరగబోయే రసవత్తర మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఏ ఒక్కదాంట్లోనూ ఓటమి లేకపోవడంతో అందరూ ఈ మ్యాచ్‌పైనే దృష్టి సారించారు.

ప్రస్తుతం టీమ్ ఇండియా అన్ని విభాగాల్లోనూ అదరగొడుతున్నది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సైతం అద్భుతమైన ఫామ్‌తో మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పేసర్ బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తుండగా.. మరో పేసర్ సిరాజ్, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పరుగులను కట్టడి చేస్తున్నారు. అయితే, గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరమవడం జట్టుకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

2019 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌లో కివీ జట్టు 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. దీంతో ఆ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నది. చివరిసారి మాంచెస్టర్‌లో రెండు జట్ల మధ్య ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరగ్గా.. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. రెండుజట్లు రిజర్వ్‌ డేలో ఆడాల్సి వచ్చింది. తాజాగా ఆదివారం జరిగే మ్యాచ్‌కు సైతం వానగండం పొంచి ఉన్నది. తుఫాను ప్రభావంతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. మధ్యాహ్నం సమయానికి తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపింది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే.. ఐసీసీ ప్రపంచకప్‌ నిబంధనల ప్రకారం.. భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌కు ‘రిజర్వ్‌’ లేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే టీమిండియా, కివీ జట్లకు చెరోపాయింట్‌ లభించనున్నది

పిచ్ రిపోర్టు

ధర్మశాల పిచ్‌పై పేసర్లు ప్రభావం చూపనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో 18 వికెట్లలో 14 వికెట్లు పేసర్లకే దక్కాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 231. ఇక్కడ జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ రెండింట చేజింగ్ చేసిన జట్లు గెలిచాయి. ధర్మశాలలో ఇరు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడగా.. 2016లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

తుది జట్ల అంచనా

భారత్ : రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ/శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్.

న్యూజిలాండ్ : కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్, లాథమ్(కెప్టెన్), ఫిలిప్స్, మార్క్ చాప్‌మెన్, శాంట్నర్, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, బౌల్ట్.

Updated : 22 Oct 2023 8:44 AM IST
Tags:    
Next Story
Share it
Top