Ind vs Pak: భారత్ - పాకిస్తాన్ వరల్డ్ కప్ చరిత్ర ఇదే.. ఎవరిది పైచేయి అంటే..?
X
వరల్డ్ కప్లో హైవోల్టేజ్ మ్యాచుకు అంతా సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు భారత్ - పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు విజయాలతో రెండు టీంలు మంచి ఊపుమీదున్నాయి. ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్‌పై భారత్ విక్టరీ కొట్టగా.. నెదర్లాండ్, శ్రీలంకపై పాక్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచి ప్రత్యర్థికి గట్టి షాకివ్వాలని రెండు టీంలూ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ ఫెవరట్గా బరిలోకి దిగుతోంది. అయితే వరల్డ్ కప్ మ్యాచుల్లో పాక్ పై భారత్దే పైచెయి.
1992 నుంచి ఇప్పటివరకూ భారత్ - పాక్ ఏడుసార్లు తలపడ్డాయి. ఈ ఏడు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించింది. 1992లో వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరి మధ్య తొలి పోటీ జరిగింది. ఆ తర్వాత 1996,1999, 2003, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగినప్పటికీ ప్రతీసారీ టీమిండియానే గెలిచింది. తాజా ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లురుతోంది. ఈ మ్యాచ్లో భారత్ ఫెవరట్గా బరిలోకి దిగుతుండడంతో పాక్పై ఒత్తిడి నెలకొంది.
టీమిండియా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తోంది. కోహ్లీ, రోహిత్, రాహుల్ మంచి ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో గిల్ కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ శుభ్‌మన్ తుది జట్టులో లేకపోతే ఇషాన్ కిషన్‌కు మరో అవకాశం దక్కనుంది. స్టార్ బౌలర్ బుమ్రా ఫామ్‌లో ఉండగా స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్ యాదవ్ కూడా రాణిస్తున్నారు. ఈ మ్యాచులో సిరాజ్ స్థానంలో షమీని తీసుకునే అవకాశం ఉంది. పాక్కు బౌలింగ్లో షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్‌లతో పటిష్టంగా ఉండగా.. బ్యాటింగ్లో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ మంచి ఫామ్లో ఉన్నారు.