Home > క్రీడలు > India vs SA : భారత్‌కు సఫారీల షాక్.. సెంచరీతో చెలరేగిన జోర్జి

India vs SA : భారత్‌కు సఫారీల షాక్.. సెంచరీతో చెలరేగిన జోర్జి

India vs SA : భారత్‌కు సఫారీల షాక్.. సెంచరీతో చెలరేగిన జోర్జి
X

టీమిండియాకు సఫారీలు షాకిచ్చారు. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా గబెరా వేదికగా జరిగిన రెండో వన్డేలో సఫారీలు 8 వికెట్ల తేడాతో గెలిచారు. 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 42.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది.ఓపెనర్లు రిజా హెండ్రిక్స్ టోనీ డీ జోర్జి (119*) (122 బంతుల్లో 119 నాటౌట్‌; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్‌ (52) హాఫ్ సెంచరీ బాదాడు. వాండర్ డసెన్ (36) రాణించాడు. తొలి మ్యాచ్‌లో సఫారీలను బెంబేలెత్తించిన భారత బౌలర్లు ఈమ్యాచ్‌లో తేలిపోయారు. అర్ష్‌దీప్‌, రింకు సింగ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించడంతో సిరీస్‌ 1-1 సమం అయింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్‌ నిర్ణయాత్మక పోరు గురువారం (డిసెంబరు 21న) జరుగనుంది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా 46.2 ఓవర్లలో 211 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. తొలి బంతికే బౌండరీ బాదిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆ తర్వాతి బంతికి ఔటై పెవిలియన్​ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్‌ వర్మ (10) కూడా అవుట్ అయ్యాడు. 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును సాయి సుదర్శన్, కేఎల్​ రాహుల్‌లు ఆదుకున్నారు. నెమ్మదిగానే బ్యాటింగ్ చేస్తూ స్కోరుబోర్డును నడిపించారు. అలా మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ చేసిన సాయి (83 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌) 27వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ ఇద్దరు తప్ప ఇంకెవరూ కనీసం 20 పరుగులైన చేయలేకపోయారు.

ఆ తర్వాత మైదానంలోకి దిగిన సంజూ శాంసన్‌ 12 పరుగులు చేసి పెవిలియన్​ చేరుకున్నాడు. కెరీర్​లో తొలి వన్డే ఆడుతున్న రింకూ సింగ్‌ (17) కూడా ఈ మ్యాచ్​లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అక్షర్‌ పటేల్‌ (7), కుల్‌దీప్‌ యాదవ్‌ (1) కూడా మెరుపులు మెరిపించలేకపోయారు. ఆఖరిలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (18) కాస్త బ్యాటుకు పని చెప్పి టీమ్ఇండియాను 200 మార్క్​ను దాటించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ 3, బ్యురాన్ హెండ్రిక్స్‌ 2, కేశవ్‌ మహరాజ్‌ 2, లిజాడ్ విలియమ్స్‌, మార్‌క్రమ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరోవైపు, ఈ మ్యాచ్​లో 2023లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.




Updated : 20 Dec 2023 7:42 AM IST
Tags:    
Next Story
Share it
Top