IND vs PAK: పాకిస్తాన్ను చిత్తు చేస్తూ.. టీమిండియా ఘన విజయం
X
వరల్డ్ కప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దయాదుల పోరు. భారత్, పాకిస్తాన్ జట్లు పోరాడుతుంటే మ్యాచ్ చూసే ప్రేక్షకుల్లో.. ఆందోళన, ఆవేశం, ఉత్సాహం, టెన్షన్ ఇలా అన్నీ కలగలిపిన ఎమోషన్స్ ఉంటాయి. అంతటి హై ఓల్టేజ్ మ్యాచ్.. మొత్తం వన్ సైడ్ అయింది. ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి అనుకుంటే.. మొదటి ఇన్నింగ్స్ నుంచి పాక్ పై ఆధిపత్యం కొనసాగించిన టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి కేవలం 32 ఓవర్లలోనే చేదించి.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై ఒక్కసారి కూడా ఓడిపోని భారత్.. అదే ఆనవాయితీని కొనసాగించింది. ఇప్పటి వరకు ఇరు జట్లు 8 సార్లు ముఖాముఖి తలపడగా.. 8 సార్లు టీమిండియా గెలిచింది. ఈ వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి.. పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.
లక్ష్య చేదనంలో టీమిండియా బ్యాటర్లు మొదట తడబడ్డారు. ఓపెనర్ శుభ్ మని గిల్ దాటిగా ఆడినా 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. మూడో వికెట్ లో వచ్చిన విరాట్ కోహ్లీ (16) తప్పుడు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఇక ఆరంభం నుంచి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ రోహిత్ శర్మ 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 86 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ (56, 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రోహిత్ కు సహకరించాడు. దాంతో టార్గెట్ చేదించడం ఈజీ అయింది. చివర్లో కేఎల్ రాహుల్ (19, 29 బంతుల్లో) రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లు షాహిన్ అఫ్రిది 2, హసన్ 1 వికెట్లు తీసుకున్నారు.