World Cup Final Match : అదిరిపోయేలా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకలు.. ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్పెషల్ షో
X
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ చివరి ఘట్టానికి చేరుకుంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరగనున్న టైటిల్ పోరులో టీమిండియా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. 5సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆసీస్ను మట్టికరిపించి మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ టీం ఎయిర్ షో నిర్వహించనుంది. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ 10 నిమిషాల పాటు నరేంద్రమోడీ స్టేడియంలో ఎయిర్ షో నిర్వహించనున్నట్లు గుజరాత్ డిఫెన్స్ పీఆర్‌ఓ ప్రకటించారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీంలో మొత్తం 9 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరడంతో ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాల్లేకుండాపోయింది.
మరోవైపు భారత్ - ఆసీస్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ చేసేందుకు ప్రధాని మోడీ స్టేడియంకు వస్తారని సమాచారం. తుదిపోరుకు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పీఎంఓ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చే ఛాన్సుంది.