Mary Kom : మేరికోమ్ సంచలన నిర్ణయం.. బాక్సింగ్కు రిటైర్మెంట్
X
మేరీ కోమ్.. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్, 5 సార్లు ఆసియా ఛాంపియన్, ఒలంపిక్ పతక విజేత. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, రాజీవ్ ఖేల్ రత్న వంటి ఎన్నో పురస్కాలు అందుకున్న బాక్సింగ్ లెజెండ్. పురుషులు కూడా సాధించలేని ఎన్నో రికార్డులు మేరీ కోమ్ సొంతం. తాజాగా బాక్సింగ్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వయస్సు రిత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన మేరీ కోమ్.. ఇకపై రింగ్లోకి దిగేది లేదని స్పష్టం చేసింది.
‘‘నాకు రిటైర్ అవ్వాలని లేదు. ఇంకా ఆడాలని ఉంది. కానీ వయోపరిమితి ముగియడంతో నేను ఏ పోటీలోనూ పాల్గొనలేను. దీంతో బాక్సింగ్ నుంచి బలవంతంగా నిష్క్రమించాల్సి వస్తోంది. నా జీవితంలో ప్రతీది సాధించాను. భవిష్యత్ లో బాక్సింగ్ కు దగ్గరగా ఉంటాను ’’ అని మేరీ తెలిపింది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం 40ఏళ్లు దాటిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ లో పాల్గొనవద్దు. ప్రస్తుతం మేరీ కోమ్ వయస్సు 41. దీంతో ఆమె తన రిటైర్ మెంట్ ప్రకటించింది.
18 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అంతర్జాతీయ ప్రవేశం చేసిన ఈ మణిపుర్ స్టార్.. ఎన్నో పతకాలను కొల్లగొట్టారు. బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి.. తొలిసారి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2002, 2005, 2006, 2008, 2010, 2018లో జరిగిన పోటీల్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. 2012 ఒలంపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 2022లో కామన్వెల్త్ క్రీడల సెలక్షన్స్ ట్రయల్ సందర్భంగా గాయపడిన ఆమె.. అప్పటి నుంచి బాక్సింగ్ రింగ్కు దూరంగా ఉంది.