డోపింగ్ టెస్ట్కు భయపడుతున్న విరాట్.. కారణం ఏంటోమరి..?
X
ఆటగాళ్లు అంతర్జాతీయంగా ఆడాలంటే.. డోపింగ్ టెస్ట్ ముఖ్యం. డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలేవి తీసుకోలేదని తేల్చడానికి ప్లేయర్లకు ఈ టెస్ట్ చేస్తారు. అయితే, ఈ టెస్ట్ కు దూరంగా ఉంటున్న భారత ఆటగాళ్ల సంఖ్య చాలా పెద్దదే ఉంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ పొందిన ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. ఓ జాతీయ న్యూస్ ఛానల్.. సమాచార హక్కు చట్టం 2005 కింద నాడా (నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) ను సమాచారం కోరగా.. ఈ విషయాలు బయటికి వచ్చాయి.
2021-22 మధ్య భారత ప్రభుత్వంలోని నాడా.. ఆటగాళ్లకు తగినన్ని డోపింగ్ టెస్ట్ లు చేయలేదని వాడా (వరల్డ్ డోపింగ్ నిరోధక ఏజెన్సీ) ఆరోపించింది. ఈ క్రమంలో డోపింగ్ టెస్ట్ లు చేసుకున్న ఆటగాళ్ల పేర్లు బయటికి వచ్చాయి. 2021-22 మధ్య 5,961 మంది భారత ప్లేయర్లు డోపింగ్ టెస్టులు చేసుకోగా.. వీళ్లలో 114 మంది క్రికెటర్లు, 1717 మంది అథ్లెట్లు ఉన్నారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న 25 మందిలో 12 మంది డోపింగ్ టెస్ట్ చేసుకోలేదు. వీళ్లలో విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రీకర్ భరత్, వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నారు.
రోహిత్ శర్మనే ఎక్కువగా:
2021-22 మధ్యలో ఎక్కువసార్లు డోపింగ్ టెస్ట్ చేసుకుంది రోహిత్ శర్మ. గడిచిన రెండేళ్లలో రోహిత్.. ఆరుసార్లు డోపింగ్ టెస్ట్ లకు హాజరయ్యాడు. 2021 నుంచి రోహిత్ కు తరచూ గాయాలయ్యాయి. అంతేకాకుండా కరోనా బారిన కూడా పడ్డాడు. వీటి నుంచి కోలుకునేందుకు మందులు వాడిన రోహిత్.. డోపింగ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరైంది. రోహిత్ తో పాటు రిషబ్ పంత్, పుజారా, సుర్యకుమార్ తో సహా మరో ఏడుగురు ఒక్కోసారి డోపింగ్ టెస్టులు చేసుకున్నారు. వీళ్లు కూడా గాయాలనుంచి కోలుకుని డోపింగ్ టెస్ట్ చేసుకున్నారు. ఇక భారత మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన.. గరిష్టంగా మూడుసార్లు శాంపిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వివరాలు బయటికి వచ్చాక టీమిండియా ఆటగాళ్లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.