ఆసియా క్రీడలకు భారత్ ఫుట్‌బాల్ జట్లు..క్రీడా మంత్రి కీలక నిర్ణయం
X
భారత్ ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. సెప్టెంబరులో చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న 2022 ఆసియా క్రీడల్లో భారత పురుషుల మరియు మహిళల ఫుట్‌బాల్ జట్లు పాల్గొననున్నాయి. ఈ మేరకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ట్వీట్ చేశారు. భారత ఫుట్‌బాల్ జట్లకు క్రీడా మంత్రిత్వ శాఖ మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రమాణాలు ప్రకారం ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ ఫుట్‌బాల్ జట్లకు అవకాశం లేకపోయినా వారి కోసం నిబంధనలు సడలించినట్లు వివరించారు. గత ప్రదర్శనలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశ గర్వించేలా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Union Sports Minister Anurag Takur tweets, "Our national football teams, both Men’s and Women’s, are set to participate in the upcoming Asian Games. The Ministry of Youth Affairs and Sports has decided to relax the rules to facilitate the participation of both the teams, which… pic.twitter.com/DKyct8qahb
— ANI (@ANI) July 26, 2023
2022లో ఆసియా క్రీడలు జరగాల్సి ఉండగా COVID-19 కారణంగా 2023కి వాయిదా వేశారు. చైనా వేదికగా సెప్టెంబర్-ఆక్టోబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హత ప్రమాణాలను ఇటీవల సవరణ చేశారు. జట్టుగా తలపడే క్రీడాంశాల్లో ఆసియాలో టాప్-8 లోపు ఉన్న భారత జట్లనే ఆసియా క్రీడలకు పంపిస్తామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో 18వ ర్యాంకులో ఉన్న భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుతో పాటు, మహిళల జట్టు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది.
ఈ నిర్ణయంపై టీమిండియా ఫుట్‌బాల్ జట్టు కోచ్ స్టిమాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన ఆవేదనను ప్రధాని మోదీకి తెలియజేశాడు. అత్యత్తమ ఫలితాలను రాబడుతున్న మన జట్టును ఆసియా క్రీడల్లో ఆడించాలని కోరారు. గత నాలుగేళ్లుగా భారత్ పురుషుల ఫుట్ బాల్ జట్టు నిలకడగా రాణిస్తోంది. ఇటీవల శాఫ్ ఫుట్ బాల్ టైటిల్ ను తొమ్మిదోసారి గెలుచుకొని చరిత్ర సృష్టించింది. టాప్ -100లోకి కూడా దూసుకొచ్చింది. ఇలాంటి సమయంలో భారతజట్టును నిబంధనల పేరుతో అడ్డుకోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆసియా క్రీడాల్లో అవకాశం కల్పించాలని క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.