సీఎస్కే గెలిచాక ఉ.9 గంటల వరకు సంబరాలు..వారు ఫ్లైట్ మిస్ అయ్యారు :కాన్వే
X
ఐపీఎల్ ముగిసి 15 రోజులు గడిచింది. ఇంకా టోర్నీకి సంబంధించిన వార్తలు వస్తునే ఉన్నాయి. ఆటగాళ్లు తమ ఐపీఎల్‌లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాజగా చెన్నై ఓపెనర్ డేవిడ్ కాన్వే సీఎస్కే విజయోత్సవాలకు సంబంధించిన విషయాలను తెలిపాడు. చెన్నై విజయం సాధించాక డ్రెస్సింగ్ రూంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరిగినట్టు వివరించాడు. రాత్రి మొదలైన హంగామా, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వరకు సాగిందని తెలిపాడు. దీంతో పలువురు ఆటగాళ్లు తమ ఫ్లైట్స్ కూడా మిస్ అయ్యారని వెల్లడించాడు. విజయోత్సవాలు కారణంగా మొయిన్ అలీ కుటుంబం, బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ ,డ్వేన్ ప్రిటోరియస్‌లు తమ విమానాలను మిస్ చేసుకున్నారని తెలిపాడు.
ధోనితో ఉన్న అనుబంధాన్ని కూడా డేవిడ్ కాన్వే పంచుకున్నాడు. "ధోనిపై గౌరవం మాటల్లో చెప్పలేనిది. అతడితో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడం అదృష్టం. ధోని రూమ్‌లోకి వస్తుంటే ఏదో తేజస్సు చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది. క్రికెట్‌లో అతడు సాధించిన ఘనతలు వెలకట్టలేనివి’’ అని కాన్వే చెప్పాడు.
ఐపీఎల్ 2023లో డేవిడ్ కాన్వే అద్భుతంగా రాణించాడు. ఓపెనర్‌గా జట్టుకు శుభారంభాలను అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా కాన్వే రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.