టీ20 వరల్డ్కప్లో కోహ్లీ ఆడుతాడో లేదో ఇప్పుడే చెప్పలేం: జై షా
X
మరో నాలుగైదు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలపై జరిగే ఈ మెగా టోర్నీపై భారత్ కన్నేసింది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే జట్టులో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారా? లేదా? అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు ఎవరి వద్ద సమాధానం లేదు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మట్ కు దూరంగా ఉన్న రోహిత్, కోహ్లీ.. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేస్తారని.. ఇప్పటి వరకు చాలామందిలో ఊహాగానాలు ఉన్నాయి. తాజాగా వాటికి బీసీసీఐ సెక్రెటరీ జైషా క్లారిటీ ఇచ్చాడు. బుధవారం (ఫిబ్రవరి 14) రాజ్ కోట్ స్టేడియానికి బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా పేరును పెట్టారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన జైషా.. టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మే కెప్టెన్ అని చెప్పాడు. రాబోయే వరల్డ్ కప్ లో భారత్ కప్పు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. వ్యక్తిగత సెలవులు తీసుకోవడం అతని హక్కు అని చెప్పాడు. ఈ విషయంలో కోహ్లీకి అండగా ఉంటాం అని చెప్పుకొచ్చాడు. అయితే మెగా టోర్నీలో కోహ్లీ ఉంటాడా లేదా అనే విషయాన్ని చెప్పలేను. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని విషయాన్ని దాటవేశాడు. అనంతరం కుర్రాళ్ల గురించి మాట్లాడుతూ.. సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న ప్రతీ ఆటగాడు జట్టులో సెలక్ట్ కాకపోతే.. దేశవాళీలో తప్పక ఆడాలని జైషా తేల్చిచెప్పాడు. మొదట ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు ప్రిఫరెన్స్ ఇచ్చి.. ఆ తర్వాత మిగతావి చూసుకోవాలని అన్నాడు. కాగా బీసీసీఐ ఇషాన్ కిషన్ పై సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్.. రంజీల్లో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.