టీ20 వరల్డ్కప్.. రోహిత్ శర్మే కెప్టెన్ అని ఖచ్చితంగా చెప్పలేం
X
టీమిండియా టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. జట్టు కూర్పును సిద్ధం చేసే పనిలో పడింది. అయితే కెప్టెన్ ఎవరన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. నిన్నిటివరకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను కొనసాగిస్తామని చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు మళ్లీ మాట మార్చింది. సెక్రటరీ జై షా కామెంట్స్ ఇప్పుడు కొత్త అనుమానాలకు దారి తీస్తుంది. రోహిత్ ను వరల్డ్ కప్ కు కెప్టెన్ గా తామింకా ప్రకటించలేదంటూ బాంబు పేల్చాడు. దాంతో మళ్లీ కెప్టెన్ విషయం మరోసారి చర్చనీయాశమయింది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్-జూలైలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా కెప్టెన్ గా రోహిత్ ఉంటాడని వార్తలు వచ్చినా.. ఎవరు కెప్టెన్ అని ప్రకటించడానికి తగినంత సమయం ఉందని షా అన్నాడు.
ప్రస్తుతం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ వరల్డ్ కప్ కంటే ముందు సౌతాఫ్రికా, ఐపీఎల్, ఆఫ్ఘనిస్తాన్ లతో సిరీస్ ఉందని షా చెప్పాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా గాయంపై మాట్లాడిన జైషా.. అతను వేగంగా కోలుకుంటున్నాడని చెప్పాడు. జనవరిలో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే టీ20 సిరీస్ కు హార్దిక్ తప్పకుండా అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా పింక్ బాల్ టెస్ట్ ల గురించి మాట్లాడుతూ.. పింక్ బాల్ టెస్ట్ లు నిర్వహించి ప్రజలలో ఆసక్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. జనవరిలో ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో.. ఆ జట్టుతో చర్చలు జరుపుతున్నామని అన్నాడు. మొత్తానికి 2024 టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ ఎవరనే విషయంలో షా క్లారిటీ ఇవ్వకుండా అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసాడు.