Sanjana Ganesan: బుమ్రా సతీమణిపై బాడీ షేమింగ్ కామెంట్స్.. ఇచ్చి పడేసింది.
X
ఓ నెటిజన్ పిచ్చివాగుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేశన్ (Sanjana Ganesan). వదినమ్మా.. అంటూ సంభోదిస్తూనే.. ‘మీరు చాలా లావుగా ఉన్నారు’’ అంటూ అనుచిత కామెంట్ చేశాడు. మహిళల శరీరాకృతిపై అలాంటి పిచ్చి కామెంట్స్ చేయడంపై గట్టిగా బదులిచ్చారు. విషయంలోకి వెళితే…ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తన ఇన్‌స్టా పేజీలో ఓ ప్రమోషన్ వీడియోను పోస్ట్ చేశారు బుమ్రా దంపతులు. ఓ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీకి చెందిన యాడ్ అది.
ఆ యాడ్‌కి సంబంధించిన వీడియోలో ... క్రికెట్ బాల్‌తో మొదలుపెట్టి.. ఫొటోషూట్ వరకు కపుల్ గోల్స్ సెట్ చేసే విషయంలో ఇలా ఉంటామంటూ బుమ్రా- సంజనా ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ వీడియోలో కనిపించారు. ఈ వీడియోపై ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ .. ‘‘వదినమ్మ.. రోజు రోజుకీ లావైపోతోంది’’ అని బాడీషేమింగ్ చేశాడు. ఇందుకు.. సంజనా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘పాఠశాలలో సైన్సు పుస్తకాల్లో చదివిన విషయాలు నీకు గుర్తులేవా? మహిళల శరీరంపై కామెంట్ చేయడానికి నీకెంత ధైర్యం? వెళ్లిపో ఇక్కడి నుంచి..’’ అంటూ చురకలు అంటించారు.
ఈ క్రమంలో అభిమానులు సంజనాకు అండగా నిలుస్తూ.. ‘‘బాగా బుద్ధి చెప్పారు భాభీ’’ అని ప్రశంసిస్తున్నారు. కాగా తల్లైన తర్వాత సాధారణంగా శరీరంలో వచ్చే మార్పుల కారణంగా సంజనా కూడా మునుపటి కంటే కాస్త బొద్దుగా కనిపించారు. దీంతో ఆకతాయి అలా కామెంట్ చేశాడు. అయితే, తానొక తల్లినన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఆమె ఇలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.