Home > క్రీడలు > తొందరపడకండి.. రెజ్లర్లకు కపిల్ సేన మద్దతు

తొందరపడకండి.. రెజ్లర్లకు కపిల్ సేన మద్దతు

తొందరపడకండి.. రెజ్లర్లకు కపిల్ సేన మద్దతు
X

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం స్పందించకపోవడంతో ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. తమ పతకాలను గంగానదిలో కలిపేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రెజ్లర్లు నిరసనపై 1983 క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ టీం స్పందించింది. మల్లయోధులకు కపిల్ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పతకాలను గంగలో పడేయడం లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరింది. రెజ్లర్ల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు 1983 వరల్డ్ కప్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది.

పోలీసుల తీరుపై అభ్యంతరం

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని 1983 వరల్డ్ కప్ టీం ఆటగాడు మదన్ లాల్ విమర్శించారు. వాళ్లను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు వ్యవహారం చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. తాము సాధించిన మెడల్స్ ను గంగా నదిలో పారేస్తామంటూ రెజ్లర్లు ప్రకటించారని, అది చాలా బాధాకరమని అన్నారు. ఎన్నో ఏళ్ల కష్టం, త్యాగం, పట్టుదలకు ఆ మెడల్స్ నిదర్శమని అన్నారు. ఆ మెడల్స్ కేవలం ఆటగాళ్లకే కాదని జాతి యావత్తుకు చెందిన సంపద అని మదన్ లాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.

బ్రిజ్ భూషణ్ అరెస్టుకు డిమాండ్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. వినేష్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ ఫునియా నేతృత్వంలో పలువురు మల్లయోధులు నిరనస తెలుపుతున్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా కేంద్రం తమ నిరసనను పట్టించుకోకపోవడంతో తాము సాధించిన పతకాలను గంగానదిలో నిమర్జనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మే 30న హరిద్వార్ కు చేరుకున్నారు. అయితే రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ అభ్యర్థన మేరకు వెనక్కి తగ్గారు. ఐదు రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని డెడ్ లైన్ విధించారు.

ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు

ఇదిలా ఉంటే బ్రిజ్ భూషణ్పై దాఖలైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మహిళా రెజ్లర్లతో ఛాతీని తాకడంతో పాటు వారి పట్ల అసభ్య పదజాలన్నిఉపయోగించినట్లు ఎఫ్ఐఆర్లో రాశారు. బ్రిజ్ భూషణ్ తమతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దారుణంగా బెదిరించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజర్లు ఆరోపించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోచ్‌ లేని సమయంలో మల్లయోధులతో అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని, గాయపడిన మహిళా రెజ్లర్ తనతో సన్నిహితంగా ఉంటే ట్రీట్ మెంట్ ఖర్చులను ఫెడరేషన్ భరించేలా చూస్తానని అన్నారని బాధితులు ఆరోపించారు.




Updated : 2 Jun 2023 11:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top