World Cup 2023: సెంచరీ పూర్తిచేయమని నేనే చెప్పా.. కేఎల్ రాహుల్
X
గురువారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ.. శతక్కొట్టి భారత్‌కు భారీ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే చివరలో భారత్ విజయం దాదాపు ఖాయమైన సమయంలో స్టేడియంలో ఉన్న ఆడియన్స్‌తో పాటు టీవీల్లో మ్యాచ్ చూస్తూన్న ప్రతీ ఒక్క క్రికెట్ ఫ్యాన్ కూడా.. కోహ్లీ కచ్చితంగా సెంచరీ చేయాలనే కోరుకున్నాడు. భారత్ టీమిండియా గెలవబోతుంది అన్న ధీమా కన్నా.. కోహ్లీ సెంచరీ కొడతాడా? లేదంటే పార్టనర్‌షిప్ లో ఉన్న కేఏల్ రాహులే ఆ మిగిలి ఉన్న పరుగులు తీస్తాడా? అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే కోహ్లీ సెంచరీకి రాహులే సపోర్ట్ ఇచ్చాడన్న సంగతి తెలిసి "ఇది కదా పార్టనర్‌షిప్ అంటే.." అనుకుంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
కోహ్లీ శతకం బాదడానికి ముందు తమ ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను కేఎల్ రాహుల్ వెల్లడించాడు. సెంచరీ సాధిస్తానని కోహ్లి కూడా అనుకోలేదట. ఛాన్స్ ఉన్నా వద్దనుకున్నాడు. కానీ తాను పట్టుబట్టడంతో చివరకు కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడని రాహులే స్వయంగా రాహుల్ చెప్పాడు. 'కోహ్లీ సింగిల్ తీద్దామంటే నేను నిరాకరించా. దీంతో తను వచ్చి ఇలా చేస్తే చూడటానికి బాగోదన్నాడు. తానేదో పర్సనల్ రికార్డుల కోసం ఆడుతున్నానని ప్రజలు అంటారని చెప్పాడు. అయితే నేను మాత్రం చాలా క్లియర్‌గా చెప్పా. మనం ఈజీగా గెలిచే ప్లేస్‌లో ఉన్నాం. కాబట్టి అవేం ఆలోచించకుండా సెంచరీ పూర్తి చేసుకో అని సలహా ఇచ్చా' అని రాహుల్ తెలిపాడు.
కోహ్లి 74 పరుగులతో ఉన్నప్పుడు.. జట్టు విజయానికి 27 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకే సెంచరీ సాధించే అవకాశమిచ్చాడు. సింగిల్స్ కోసం కోహ్లి ప్రయత్నించినా రాహుల్ వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 97తో ఉన్నాడు. జట్టు విజయానికి రెండు పరుగులే కావాలి. 42వ ఓవర్ తొలి బంతి లెగ్‌సైడ్ వెళ్లడంతో అంపైర్ వైడ్ ఇస్తాడా? అన్నట్లు కోహ్లి చూశాడు. కానీ కోహ్లి కాస్త లోపలికి జరిగాడని భావించి అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో కోహ్లితో పాటు అభిమానులూ ఊరట చెందారు. మూడో బంతికి సిక్సర్‌తో కోహ్లి శతకం అందుకున్నాడు.