Home > క్రీడలు > గతంలో మూడిట్లో ఓడిపోయాం.. ఇప్పుడు ఒకటి ఊహిస్తే.. మరొకటి జరిగింది: కేఎల్ రాహుల్

గతంలో మూడిట్లో ఓడిపోయాం.. ఇప్పుడు ఒకటి ఊహిస్తే.. మరొకటి జరిగింది: కేఎల్ రాహుల్

గతంలో మూడిట్లో ఓడిపోయాం.. ఇప్పుడు ఒకటి ఊహిస్తే.. మరొకటి జరిగింది: కేఎల్ రాహుల్
X

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ను సమం చేసిన టీమిండియా.. 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. జొహానెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ప్రొటీస్ కు చుక్కలు చూపించి.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట పేసర్లు అర్ష్ దీప్ సింగ్ (5), అవేశ్ ఖాన్ (4) రాణించడంతో సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) సత్తా చాటడంతో.. 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి టీమిండియా గెలుపొందింది. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫల్ మార్క్స్ కొట్టేశాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. ‘కెప్టెన్ గా వన్డేల్లో సౌతాఫ్రికా గడ్డపై తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెప్టెన్సీలో గత పర్యటనలో ఇక్కడ ఆడిన మూడు మ్యాచుల్లో ఓడిపోయాం. నిన్నటి పిచ్ మేం ఊహించిన దానికన్నా పూర్తి భిన్నంగా ఉంది. పోయిన మ్యాచుల్లో స్పిన్నర్లకు అనుకూలించింది. ఈ మ్యాచ్ లో కూడా అదే జరుగుతుందని అనుకున్నాం. మొదట అక్ష్ పటేల్, కుల్దీప్ యాదవ్ లతో బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ అనుకోకుండా పిచ్ కండీషన్ మారిపోయింది. పేసర్లకు సహకరించింది. మా పేసర్లు కరెక్ట్ ప్లేసులో బంతులేసి వికెట్లు రాబట్టారు. పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నార’ని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా నిన్నటి విజయంలో సౌతాఫ్రికాపై పింక్ వన్డేలో గెలిచిన తొలి కెప్టెన్ గా రాహుల్ రికార్డుకెక్కాడు. గతంలో ఏ టీమిండియా కెప్టెన్ పింక్ వన్డేలో సౌతాఫ్రికాపై విజయం సాధించలేదు.


Updated : 18 Dec 2023 5:24 PM IST
Tags:    
Next Story
Share it
Top