Eng vs Ban: ఇంగ్లాండ్ బోణీ.. భారీ చేదనలో బంగ్లా బోల్తా
X
ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. బంగ్లాదేశ్ ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన తర్వాత పట్టు బిగించిన ఇంగ్లాండ్.. రెండు మ్యాచ్ లో సత్తా చాటింది. బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ 140 పరుగులతో బంగ్లాదేశ్ పై విరుచుకు పడ్డాడు. జో రూట్ (82), జానీ బెయిర్ స్టో (52 ) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 4 వికెట్లు పడగొట్టాడు. షోర్‌ఫుల్ ఇస్లాం 3, టాస్కిన్ అహ్మద్, షకీబ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
365 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. 48.2 ఓవర్లలో 227 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆరంభంలోనే బంగ్లాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్ టాప్లీ ఫస్ట్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడగొట్టి బంగ్లాను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓపెనర్ లిట్టన్ దాస్ (76) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లిట్టన్ దాస్.. రహీమ్ (51), తౌహిద్ హృదయ్ (39)లతో కలిసి పోరాడినా ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు టాప్లీ 4 వికెట్లు తీసుకోగా.. క్రిస్ వోక్స్ 2, సామ్ కరణ్, మార్క్ వుడ్, అడిల్ రషిద్, లివింగ్ స్టోన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.