PAK vs NED: హైదరాబాద్‌లో నేడు వరల్డ్ కప్ మ్యాచ్
X
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో శుక్రవారం రెండో మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. దాయాది కొన్నేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టింది. ఆసియాకప్‌లో వరుస ఓటములతో డీలా పడిన పాకిస్థాన్ జట్టు.. మెగా టోర్నీలో తొలి విజయం సాధించాలనే తపనతో ఉంది. బ్యాటర్ల ఫామ్ లేమి జట్టును బాధిస్తుండగా.. నెల రోజుల ముందు వరకు ఎంతో బలంగా కనిపించిన బౌలింగ్ విభాగం ఇప్పుడు సాధారణంగా మారడం కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గాయంతో నసీమ్ షా దూరం కావడంతో బౌలింగ్ విభాగం కొంత బలహీన పడింది. ప్రధాన బౌలర్ షహీన్ షా అఫ్రీది ముందుండి నడిపించనున్నాడు.
మరోవైపు.. తొలి మ్యాచ్‌లోనే పెద్ద జట్టుకు షాక్ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తున్నది. క్వాలిఫయర్ టోర్నీలో వెస్టిండీస్ వంటి భీకర జట్టును మట్టికరిపించి ఆ జట్టు వరల్డ్ కప్ బెర్త్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.. ఒకప్పుడు పసికూనగా ఉన్న నెదర్లాండ్స్ ఇప్పుడు ఒత్తిడిని తట్టుకొని మరీ నిలబడుతోంది. పెద్ద జట్లపైనా మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. మాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, కొలిన్ అకెర్‌మన్, స్కాట్ ఎడ్‌వర్డ్స్, భారత సంతతికి చెందిన విక్రమ్ జీత్ బాగా ఆడతారు. పాల్ వాన్ మీకెరన్, షరిజ్ అహ్మద్, రోయిలెఫ్ వాన్‌డెర్ మెర్వ్ బౌలింగ్ బాగుంటుంది. మిడిలార్డర్‌లో తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు పరుగులు సాధించగలడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని డచ్ టీమ్ సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది.
ఇక నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్న తేజ నిడమానురు.. తెలుగు క్రికెటర్ కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడకు చెందిన తేజ నిడమానురు.. నెదర్లాండ్స్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. పాకిస్థాన్‌తో హైదరాబాద్ వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌కు అతని కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.క్వాలిఫయర్ టోర్నీలో తేజ నిడమానూరు జింబాబ్వేపై సెంచరీ సాధించాడు. 110 పరుగులతో అజేయంగా నిలిచి నెదర్లాండ్స్‌కు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ గడ్డపై తన కుటుంబ సభ్యుల మధ్య ఎలా రాణిస్తాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పాకిస్థాన్ జట్టు (అంచనా): ఫకర్ జమాన్, ఇమాముల్ హఖ్, బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ / సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రౌఫ్
నెదర్లాండ్స్ జట్టు (అంచనా): విక్రమ్ జీత్ సింగ్, మాక్స్ ఓ డౌడ్, వెస్లీ బారెసి, తేజ నిడమానూరు, బాస్ డి లీడ్, కొలిన్ అకెర్‌మన్, స్కాట్ ఎడ్‌వర్డ్స్, రియాన్ క్లెయిన్, లోగన్ వాన్ బీక్, రోయిలెఫ్ వాన్ డెర్ మెర్వ్, షరీఫ్ అహ్మద్, పాల్ వాన్ మీకెరన్