World cup 2023 : అహ్మదాబాద్కు చేరుకున్న పాక్ టీం
X
2023 వన్డే వరల్డ్ కప్‌లో అసలు సిసలు సమరానికి సమయం దగ్గరపడుతోంది. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా - పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న ఢీకొట్టేందుకు దాయాదులు సమాయత్తమవుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరు కోసం పాకిస్థాన్ జట్టు అహ్మదాబాద్కు చేరుకుంది. ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కూడా అహ్మదాబాద్ వెళ్లనుంది.
వరల్డ్ కప్లో భాగంగా ఉప్పల్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌లలో పాక్ జట్టు విజయం సాధించింది. ఫస్ట్ మ్యాచ్ లో నెదర్లాండ్స్‌పై 81 పరుగులతో గెలుపొందిన పాక్.. మలి మ్యాచ్‌లో శ్రీలంక ఇచ్చిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. రెండు విజయాల అనంతరం పాక్ జట్టు టీమిండియాతో పోరుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభ మ్యాచ్లో తడబాటుకు గురైన రోహిత్ సేన, కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుత భాగస్వామ్యంతో గట్టెక్కింది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది.