PKL-10 విజేతగా పుణెరి పల్టన్.. ఫైనల్లో హర్యానా ఓటమి
X
(Pro Kabaddi League) ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ విజేతగా పుణెరి పల్టన్ నిలిచింది. హర్యానా స్టీలర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 28-25 తేడాతో విజయం సాధించింది. పుణెరి టీమ్ ప్రో కబడ్డీ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలవడం ఇదే తొలిసారి. ఆ జట్టలో పంకజ్ మోహితే 9,మోహిత్ గోయత్ 5 రైడ్ పాయింట్లతో, గౌరవ్ 4 టాకిల్ పాయింట్లతో రాణించారు. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి టైటిల్ కోసం పుణెరి పల్టన్, హర్యానా స్టీలర్స్ మధ్య గట్టి పోటీయే నడిచింది. చివరికి పుణెరి ఈ మ్యాచ్ లో పైచేయి సాధించింది. మ్యాచ్ మొదటి నుంచీ హర్యానాపై ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చిన పుణెరి పల్టన్.. చివరికి టైటిల్ సొంతం చేసుకుంది. కేవలం మూడు పాయింట్ల తేడాతో పుణెరి గెలిచింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 గతేడాది డిసెంబర్ 2న ప్రారంభమైంది. మొత్తానికి సుమారు 70 రోజులు, 132 మ్యాచ్ ల తర్వాత మార్చి 1న హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ తో ముగిసింది.
ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. ఒక్కో టీమ్ లీగ్ స్టేజ్ లో 22 మ్యాచ్ లు ఆడింది. అందులో 11 సొంతగడ్డపై, 11 మ్యాచ్ లు ప్రత్యర్థుల దగ్గరా ఆడాయి.ప్రతి సారి తెలుగు టైటన్స్ పేలవమైన ప్రదర్శన కోనసాగిస్తున్నాది. ఈసారి టైటన్స్ టీమ్ 22 మ్యాచ్ లలో కేవలం 2 గెలిచి, 19 ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరీ దారుణమైన ప్రదర్శన చేసిన తెలుగు టైటన్స్ టీమ్ తమ కోచ్ శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేసింది. కొత్త కోచ్ కేకే హుడాగా నియమితుడయ్యాడు. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ మొత్తం ప్రైజ్ మనీ రూ.8 కోట్లుగా ఉంది. ఐదో సీజన్ నుంచి ప్రతి సీజన్ లోనూ మొత్తం ప్రైజ్ మనీ ఇంతే ఉంటూ వస్తోంది. ఇందులోనే విన్నర్, రన్నరప్ తోపాటు ఆరోస్థానం వరకూ నిలిచిన జట్లు, ప్లేయర్స్, రిఫరీలకు ప్రైజ్ మనీ అందిస్తారు. లీగ్ సీజన్ -10 విజేతగా నిలిచిన పుణెరి పల్టన్ రూ.3 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన హర్యానా స్టీలర్స్‌కు రూ.1.80 కోట్లు దక్కంది. సైమీ ఫైనల్ జట్లు రూ.90 లక్షలు,ఎలిమినేటర్‌లో ఓడిపోయిన జట్లు రూ.45 లక్షలు చోప్పున సొంతం చేసుకున్నాయి. ఈ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా అస్లాం ముస్తాఫా నిలిచారు. ఎంవీపీ ప్లేయర్ అవార్డు కింద అతడు రూ.20 లక్షలు గెలుచుకున్నాడు.