Home > క్రీడలు > దేశవాళీ క్రికెట్లో సంచలనం.. 24 ఏండ్ల నాటి యువీ రికార్డు బ్రేక్

దేశవాళీ క్రికెట్లో సంచలనం.. 24 ఏండ్ల నాటి యువీ రికార్డు బ్రేక్

దేశవాళీ క్రికెట్లో సంచలనం.. 24 ఏండ్ల నాటి యువీ రికార్డు బ్రేక్
X

దేశవాళీ క్రికెట్లో సంచలనం నమోదైంది. బీసీసీఐ నిర్వహించే అండర్ 19 టోర్నమెంట్లో ఓ యువ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. షిమోగా వేదికగా కర్నాటక - ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో కర్నాటక ప్లేయర్ ప్రకార్ చతుర్వేది క్వాడ్రపుల్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 24 క్రితం యువరాజ్ సింగ్ సృష్టించిన రికార్డును బద్దలుకొట్టాడు.

బీసీసీఐ నిర్వహించే కూచ్బెహార్ ట్రోఫీలో భాగంగా అండర్ 19లో భాగంగా కర్నాటక - ముంబై మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అందులో ప్రకార్ చతుర్వేది ఏకంగా 400లకు పైగా రన్స్ చేశాడు. కర్నాటకకు స్పష్టమైన ఆధిక్యంతో పాటు ట్రోఫీని సాధించిపెట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓపెనర్గా బరిలో దిగిన ప్రకార్ చతుర్వేది 638 బంతుల్లో 46 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల కొట్టి 404 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. చతుర్వేది బ్యాటింగ్లో కర్నాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 890 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

టోర్నీలో భాగంగా మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కర్నాటక టీంలో చతుర్వేది (404 నాటౌట్), హర్షిల్‌ ధర్మాని (169), కార్తికేయ (72), కార్తిక్ (50), సమర్థ్‌ (55 నాటౌట్‌) రాణించడంతో భారీ స్కోరు చేయగలిగింది. నాలుగు రోజులు ముగియడంతో మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా తొలి ఇన్నింగ్స్‌లో లీడ్‌ ఉండటంతో కర్నాటక విజేతగా నిలిచింది.

క్వాడ్రపుల్ సెంచరీ చేసిన ప్రకార్ చతుర్వేది 24 ఏండ్ల క్రితం నాటి యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 1999లో ఓ మ్యాచ్‌లో యువీ 404 బంతులకు 358 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ రికార్డును కర్నాటకకు చెందిన ప్రకార్ తన పేరిట లిఖించుకున్నాడు.

Updated : 15 Jan 2024 6:39 PM IST
Tags:    
Next Story
Share it
Top