Prithvi Shaw : చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తొలిసారి!
X
(Prithvi Shaw)రంజీ ట్రోఫీలో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు భారత యువ క్రికెటర్ పృథ్వీ షా. క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. వచ్చిన మ్యాచ్ లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. ముంబై తరపున ఆడుతున్న ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ ఛత్తీస్‌గడ్‌పై సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-బీలో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ అద్భుతంగా రాణించాడు. 185 బంతుల్లో 159 పరుగులు రాబట్టాడు. కాగా ఇందులో 18 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే పృథ్వీ షా సంచలన రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీలో మ్యాచ్ తొలి రోజున మొదటి సెషన్‌లోనే 2 సెంచరీలు నమోదు చేసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ గా షా నిలిచాడు. ఇదివరకు అస్సోం పై కూడా ఇదే రీతిలో సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీలో భారీ స్కోరు 379 సాధించే క్రమంలో ఆట తొలి సెషన్‌లోనే సెంచరీ సాధించాడు. దీంతో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ప్రారంభ సెషన్‌లో రెండు సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కాడు.
అయితే, ఛత్తీస్‌గడ్‌పై మ్యాచ్‌లో క్రికెటర్ భుపేన్ లాల్వానీతో కలిసి పృథ్వీ షా మొదటి వికెట్‌కు 244 పరుగుల భారీ పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. దీంతో ముంబై 310/4 వద్ద తొలి రోజు ఆట ముగిసింది. ప్రస్తుతానికి 5 మ్యాచ్‌లు ఆడిన ముంబై 4 మ్యాచ్ లు గెలిచి, 1 ఓటమితో గ్రూప్-బీలో టేబుల్ టాపర్ గా ఉంది.
కాగా 24 ఏళ్ల ఈ యువ బ్యాట్స్‌మెన్ ఆరు నెలల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. గతేడాది ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన బెంగాల్ వర్సెస్ ముంబై మ్యాచ్‌లో పృథ్వీ షా గాయపడ్డాడు. మోకాలి గాయంతో బాధపడ్డ అతడు లండన్‌లో సర్జరీ చేయించుకుని తిరిగి వచ్చాడు. ఇటీవలే ఫిట్‌నెస్ టెస్ట్‌లో అతడికి క్లియరెన్స్ లభించింది. 2018లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన యంగ్ టీమిండియాకు అతడు కెప్టెన్ గా వ్యవహరించాడన్న విషయం తెలిసిందే.