Home > క్రీడలు > తండ్రి కొడుకులను ఔట్ చేసిన అశ్విన్..

తండ్రి కొడుకులను ఔట్ చేసిన అశ్విన్..

తండ్రి కొడుకులను ఔట్ చేసిన అశ్విన్..
X

వెస్టిండీస్-టీమిండియా మొదటి టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. 2011 వెస్టిండీస్ పర్యటనలో మాజీ క్రికెటర్ శివనారయణ్ చంద్రపాల్‌ను ఔట్ చేసిన అశ్విన్..తాజా మ్యాచ్‌లో శివనారయణ్ చంద్రపాల్ తనయుడు తేజ్‌ నారయణ్ చంద్రపాల్‌ వికెట్‌ తీశాడు. తేజ్‌ నారయణ్ వ్యక్తిగత స్కోర్ 12 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఈ ఫీట్ సాధించి మొదటి భారత్ బౌలర్‌గా, ఓవరాల్‌గా నాలుగో బౌలర్‌గా అశ్విన్ చరిత్రకెక్కాడు. అతని కన్నా ముందు టెస్ట్ క్రికెట్‌లో ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, మిచెల్ స్టార్క్ ఈ ఫీట్ సాధించారు.


కుంబ్లే రికార్డు బద్దలు..

దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును కూడా అశ్విన్ బద్దలు కొట్టాడు.. టెస్ట్ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ ద్వారా అత్యధిక వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్ 95 క్లీన్ బౌల్డ్‌లు చేయగా అనిల్ కుంబ్లే 94 సార్లు ఔట్ చేశాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత కపిల్ దేవ్(88), మహమ్మద్ షమీ(66)లు ఉన్నారు.

వెస్టిండీస్ టపాటపా

మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరేబియన్లను భారత్ బౌలర్లు దెబ్బకొట్టారు. ఆరంభంలోనే అశ్విన్ షాకిచ్చాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీశాడు. తర్వాత శార్థూల్ ఠాకూర్, జడేజా ఒక్కో వికెట్ తీయడంతో వెస్టిండీస్ లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైశ్వాల్‌ అరంగేట్రం చేశారు.


Updated : 12 July 2023 4:59 PM GMT
Tags:    
Next Story
Share it
Top