IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే!
X
ఎన్నో ఆశలతో వరల్డ్ కప్ బరిలోకి దిగిన టీమిండియా ఓటమి పాలయింది. టోర్నీ మొత్తం అజేయంగా నిలిచిన జట్టు.. తుది పోరుకు వచ్చేసరికి చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఫెయిలై.. కంగారుల చేతిలో కంగుతింది. ఏ ఒత్తిడిలేకుండా అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా.. ఆరోసారి కప్పు ఎగరేసుకుపోయింది. కాగా మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమికి గల కారణాలను వివరించాడు. మెరుగైన జట్టు చేతిలో ఓడిపోయామని ఓటమిని అంగీకరించాడు. మ్యాచ్ ఫలితం తమకు అనుకూలంగా రాలేదని, ఫైనల్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని విచారం వ్యక్తం చేశాడు. ‘ఫైనల్లో విజయానికి అవసరమైనన్ని పరుగులు చేయలేకపోయాం. ఇంకా 20-30 పరుగులు చేసుంటే బాగుండేది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 270-280 స్కోర్ చేయాలనుకున్నాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో అది సాధ్యం కాలేదు. ట్రావిస్ హెడ్, లబుషేన్ మా నుంచి విజయాన్ని దూరం చేశారు. వారిద్దరికీ క్రెడిట్ ఇవ్వాలి. లైట్ల కింద బ్యాటింగ్ చేయడం వారికి కొంచెం ఈజీ అయింది’ అని వివరించాడు. 240 పరుగులను కాపాడుకోలేకపోయాం. వికెట్లు తీయడంలో విఫలం అయినట్లు చెప్పాడు. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందనే సాకులు చెప్పట్లేదని అన్నాడు.