Rohit Sharma: రోహిత్ శర్మ విశ్వరూపం.. ఆఫ్గాన్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం..
X
క్రికెట్ ప్రపంచకప్ సమరంలో టీమిండియా భారీ విజయం అందుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. రోహిత్ శర్మ 131 (84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) కొట్టి టీమిండియాను విజయానికి చేరువ చేశాడు. అఫ్గాన్ ఇచ్చిన 273 పరుగుల టార్గెట్ ను రోహిత్ సేన 2 వికెట్లు కోల్పోయి 35 ఓవర్లలోనే ఛేదించింది. అఫ్గాన్ బౌలర్లకు రోహిత్ శర్మ చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 63 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుని ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
విరాట్ కోహ్లీ 55*(56 బంతుల్లో 6 ఫోర్లు)అర్ధ శతకం బాదాడు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (25*) పరుగులు చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 8 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ టీం 50 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 272 రన్స్ చేసింది. హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రెహ్మనుల్లా గుర్బాజ్ (21), ఇబ్రహీం జాద్రాన్ (22), రహమత్ షా (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80) (88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహ్మద్ నబీ (19), రషీద్‌ఖాన్ (16), ముజీబుర్ రెహ్మన్ (10*), నవీనుల్ హక్ (9*) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4వికెట్లు తీయగా.. పాండ్యా 2 వికెట్లు తీశాడు. అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన శార్దుల్ 6 ఓవర్లు వేసి 31 రన్స్ ఇచ్చి వికెట్లు ఏమి తీయలేదు.