వింబుల్డన్ విజేతను ఆకాశానికెత్తేసిన క్రికెట్ దిగ్గజం...
X
టెన్నిస్ చరిత్రలో సంచలనం నమోదైన సంగతి తెలిసిందే. వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌కు షాక్ తగిలింది. వింబుల్డన్‌లో ఎదురులేని జకోవిచ్‌ను 20 ఏళ్ల కార్లోస్ అల్కరాస్ మట్టికరిపించాడు. ఆదివారం ఎంతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఈ స్పెయిన్ ఆటగాడు 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో జకోవిచ్‌ను ఓడించి.. తొలి వింబుల్డన్ టైటిల్ (Wimbledon title) సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కార్లోస్ అల్కరాస్ పేరు మారుమ్రోగిపోతోంది. అతడి ఆటను ఆకాశానికెత్తేస్తున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం అల్కరాస్ ఆటను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. అతడొక అద్భుతమైన ఆటగాడంటూ ట్వీట్ చేశాడు.
‘‘ఎంతో అద్భుతమైన ఫైనల్ పోరు ఇది. ఇద్దరు ఆటగాళ్లు గొప్పగా ఆడారు. టెన్నిస్‌లో మరో సూపర్‌స్టార్ ఎదుగుతున్నాడు. ఫెదరర్ కెరీర్‌ను అనుసరించినట్లే మరో 10-12 ఏళ్లు.. కార్లోస్ కెరీర్‌ను నేను ఫాలో అవుతాను. అతడికి నా అభినందనలు’’ అంటూ సచిన్ టెండూల్కర్ కార్లోస్ అల్కరాస్ అభినందించాడు.
జకోవిచ్‌కు షాక్..
వింబుల్డన్ అంటే మొదట గుర్తొచ్చేది జకోవిచ్ పేరే. అక్కడ జకోకు తిరుగులేని రికార్డు ఉంది. 2013 నుంచి ఈ టోర్నీలో పది ఫైనల్స్ ఆడితే అందులో ఏడు టైటిల్స్ జకోవిచ్ నెగ్గాడు. 2018 నుంచి అతడు ఇక్కడ ఏ ఫైనల్‌లో కూడా ఓడింది లేదు. అలాంటి జకోవిచ్‌ను అల్కరాస్ ఓడించి కొత్త చరిత్ర సృష్టించాడు.
అల్కరాస్ అద్భుతం..
టెన్నిస్‌లో అల్కరాస్ ఓ అద్భుతం. 20 ఏండ్లకే పురుషుల టెన్నిస్ నెంబర్ వన్ స్టార్ అయిన అల్కరాస్‌కు వింబుల్డన్ ఫైనల్ రెండోది మాత్రమే. గతేడాది యూఎస్ ఓపెన్ నెగ్గిన అల్కరాస్.. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ వరకూ వెళ్లాడు. రోజురోజుకూ రాటుదేలుతు వచ్చిన అల్కరాస్ వింబుల్డన్ లో విజృంభించాడు. వింబుల్డన్ లో తొలి సెట్ గెలిచిన తర్వాత ఆ మ్యాచ్ లో ఓడిపోవటం అన్నది జకోవిచ్ హిస్టరీలో లేదు. అలాంటి రికార్డును ఈ యువఆటగాడు చెరిపేశాడు. ఊహించని విధంగా జకోవిచ్ పై విజయం సాధించి కొత్త చరిత్ర లిఖించాడు.