సిరీస్పై కన్ను.. నేడే మూడో టీ20
X
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా జోరుమీదుంది. అదే ఊపులో ఇవాళ జరిగే మూడో మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. గువహతి వేదికపై జరుగనున్న ఈ మ్యాచ్ లో గట్టి పోటీ ఇవ్వాలని ఆసీస్ చూస్తుంది. రెండు టీ20ల్లో ఓడినందుకు ప్రతీకారంగా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని చూస్తుంది. కాగా ఈ మ్యాచ్ తిలక్ వర్మకు ఆఖరిదా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. మొదటి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా.. తిలక్ వర్మ దాన్ని వినియోగించుకోలేకపోయాడు. రెండు మ్యాచ్ లు కలిపి 12 బంతులు ఎదుర్కొన్ని తిలక్.. కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
హిట్టర్ గా పేరున్న తిలక్ మ్యాచ్ లో ఫెయిల్ అవ్వడం కాస్త చర్చనీయాంశమైన విషయమే. అంతేకాకుండా చివరి రెండు టీ20లకు శ్రేయస్ అయ్యర్ టీంలోకి వస్తున్నాడు. దీన్నిబట్టి చూస్తే.. తిలక్ ను తప్పించి శ్రేయస్ ను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రింకూ సింగ్ టీమిండియాకు వెన్నెముకలా మారాడు. తన స్థానానికి న్యాయం చేస్తున్నాడు. రెండు మ్యాచుల్లో చెలరేగి జట్టును గెలిపించాడు. కాగా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ గా ముందుండి టీంను నడిపిస్తున్నాడు. మరో 60 రన్స్ చేస్తే సూర్య కుమార్ యాదవ్.. ఇండియా తరఫున 2 వేల రన్స్ పూర్తి చేసిన నాలుగో బ్యాటర్ గా రికార్డులకెక్కుతాడు.
జట్లు (అంచనా)
ఇండియా: సూర్య కుమార్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్.
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), స్మిత్, షార్ట్, ఇంగ్లిస్, మ్యాక్స్వెల్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆడమ్ జంపా, నేథన్ ఎలిస్, బెరెన్డర్ఫ్ / సీన్ అబాట్, తన్వీర్ సంగా.