Home > క్రీడలు > కోర్టు విచారణకు వెళ్లాల్సిందే.. అజహరుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

కోర్టు విచారణకు వెళ్లాల్సిందే.. అజహరుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

కోర్టు విచారణకు వెళ్లాల్సిందే.. అజహరుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
X

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌కు సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసులు సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ధిక్కరణ నోటీసును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిన్ పై ఈ దశలో విచారణ జరపలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే లీగ్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు అనుమతించేలా ఆదేశాలివ్వాలంటూ నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ 2021లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 2021-22 లీగ్‌ మ్యాచ్‌లకు నల్గొండ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ను అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు అనుబంధ జట్టుగా ఉన్న తమను హెచ్సీఏ నిర్వహించే అన్ని సమావేశాలు, మ్యాచ్ లు, టోర్నమెంట్లకు అనుమతించేలా హెచ్ సీఏతో పాటు అప్పటి అధ్యక్షుడు అజహరుద్దీన్, బీసీసీఐను ఆదేశించాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్పైనా న్యాయస్థానం నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది.

కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో ఈ ఏడాది ప్రారంభంలో నల్గొండ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ తెలంగాణ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. 2022 నాటి హైకోర్టు ఉత్తర్వులను హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగా పాటించట్లేదని ఆరోపించింది. అంతేగాక, NDCA ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌కు సైతం అజహరుద్దీన్‌ అనుమతించలేదని చెప్పింది. దీనిపై ఏప్రిల్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం అజహరుద్దీన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. జూన్‌ 23న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన కోర్టు ఆదేశాలపై తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని చెప్పగా ఆయన వివరణతో సంతృప్తి చెందని హైకోర్టు.. ఆగస్టు 4న మరోసారి కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై అజహరుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.


Updated : 22 July 2023 12:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top