మార్క్ వుడ్ను వదులేసిన లక్నో.. ఐపీఎల్ 2024లో స్టార్ బౌలర్కు చోటు
X
ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్ ను రూ.3 కోట్లకు వేలంలో కొనుగోలు చేసిన లక్నో ఫ్రాంచైజీ.. ఇప్పుడు అతన్ని వదులుకుంది. పాతికేళ్ల విండీస్ కుర్రాడు.. షమర్ జోసెఫ్ ను మార్క్ వుడ్ స్థానంలో జట్టులోకి తీసుకుంది. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులేసే మార్క్ వుడ్.. 2023 సీజన్ లో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో లక్నో యాజమాన్యం అతన్ని తప్పించింది. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో.. సొంతగడ్డపై ఆసీస్ నడ్డి విరిచిన షమర్ జోసెఫ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. తన కెరీర్ తొలి బంతిని అద్భుతంగా మొదలుపెట్టాడు. దుర్భేద్యమైన ఆసీస్ జట్టును, తన కంచుకోటైన గబ్బలో గజగజ వణికించాడు. 8 కీలక వికెట్లు పడగొట్టి సిరీస్ డ్రా చేయడంలో భాగస్వామ్యం అయ్యాడు. ఫుట్ బాల్ ప్లేయర్ గా కెరీర్ ను మొదలుపెట్టి, మూడు నెలల ముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నెట్ బౌలర్ గా ఎంట్రీ ఇచ్చి.. విండీస్ జట్టులో అరంగేట్రం ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
ఎవరీ షమర్ జోసెఫ్..?
ఆగస్ట్ 31, 1999లో పుట్టిన షమర్ జోసెఫ్ కు.. చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఆర్థిక కష్టాలు కుటుం భారాన్ని మోసేలా చేశాయి. అయితే ఎక్కడా కుంగిపోలేదు. తన లక్ష్యాన్ని విడువలేదు. సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూనే.. కుటుంబానికి అండగా నిలబడ్డాడు. టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ.. క్రికెట్ లో అంచలంచెలుగా ఎదిగాడు. వెస్టిండీస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టి సత్తాచాటాడు. ఏడాది తిరగకముందే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడు నెలల ముందు జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నెట్ బౌలర్ గా ఉన్న జోసెఫ్.. ఆ టైంలోనే సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంకేముంది.. వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ తో జరుగుతున్న సిరీస్ లో అరంగేట్రం చేసి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఏడాది క్రితం ఫట్ బాల్ క్లబ్ లో కూడా షమర్ జోసెఫ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఓవల్ లో జరిగిన తొలి మ్యాచ్ లో అరంగేట్రం చేసిన జోసెఫ్.. తన కెరీర్ డ్రీమ్ డెబ్యూ చేశాడు. తొలి బంతేకే స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను ఔట్ చేశాడు. ఆ మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డ్ ను తన పేరిట రాసుకున్నాడు. ఇక రెండో మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ మాత్రమే పడగొట్టినా.. రెండో ఇన్నింగ్స్ లో చెలరేగి 7 వికెట్లు తీసుకున్నాడు. దీంతో 215 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక ఆసీస్ కుప్పకూలింది. దీంతో 27 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. విండీస్ యువ జట్టు చరిత్ర లిఖించింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.