Home > క్రీడలు > IND vs ENG: బోల్తాపడ్డ ఇంగ్లాండ్.. టీమిండియా భారీ విజయం

IND vs ENG: బోల్తాపడ్డ ఇంగ్లాండ్.. టీమిండియా భారీ విజయం

IND vs ENG: బోల్తాపడ్డ ఇంగ్లాండ్.. టీమిండియా భారీ విజయం
X

ఈజీ టార్గెటే అయినా.. ఇంగ్లాండ్ బోల్తా పడింది. టీమిండియా బాలింగ్ ముందు మోకరిల్లింది. బుమ్రా, షమీ విజృంభించడంతో చేతులెత్తేశారు. ఒత్తిడిని ఎదుర్కోలేక చాపచుట్టేసింది. భారత్ నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో విఫలం అయింది. 34.5 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. టోర్నీలో ఆడిన 6 మ్యాచుల్లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన టీమిండియా.. 6 విజయాలను నమోదుచేసి సెమీస్ కు అర్హత సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆడిన 6 మ్యాచుల్లో ఐదిట్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో చివరన నిలిచింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ ను.. ఇంగ్లాండ్ 229 పరుగులకే కట్టడి చేసింది. ఇంగ్లాండ్ ఆరంభంలో టీమిండియాకు షాక్ ఇచ్చింది. వెంటవెంటనే వికెట్లు పడగొట్టి భారత్ కు కోలుకోలేని దెబ్బకొట్టింది. దాంతో 50 పరుగుల్లోపే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. గిల్ (9), కోహ్లీ డకౌట్, శ్రేయస్ (4), జడేజా (8) ఫెయిల్ అవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ, రోహిత్ శర్మ (87, 101 బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మకు తోడుగా.. కేఎల్ రాహుల్ (39, 58 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్ (49, 47 బంతుల్లో) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో.. టీమిండియా 229 పరుగులు చేయగలిగింది. చివర్లో బుమ్రా 16 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు తీసుకోగా.. క్రిస్ వోక్స్, అడిల్ రషిద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ ఉడ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

230 లక్ష్య చేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. బుమ్రా, షమీ నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. మొదటి ఓవర్లలో ఇంగ్లాండ్ ఓపెనర్లు డేవిడ్ మలాన్ (16), బెయిస్ట్రో (14) కాస్త ఇబ్బంది పెట్టినా.. బుమ్రా, షమీ వాళ్లను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పారు. తర్వాత వచ్చిన రూట్, బెన్ స్టోక్స్ డకౌట్ అయ్యారు. దీంతో మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చింది. కుల్దీప్, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో ఏ ఇంగ్లాండ్ బ్యాటర్ 30 పరుగులు కూడా చేయలేకపోయారు. బట్లర్ 10, మోయిన్ అలి 15, లివింగ్ స్టోన్ 27, క్రిస్ వోక్స్ 10, డేవిడ్ విల్లీ 16, అడిల్ రషిద్ 13 పరుగులు మాత్రమే చేశారు. కాగా షమీ 4 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు దక్కింది.

Updated : 29 Oct 2023 9:44 PM IST
Tags:    
Next Story
Share it
Top