South Africa vs India : కాసేపట్లో భారత్ - సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే..
X
కాసేపట్లో భారత్ - సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు జోహన్నెస్‌బర్గ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ షురూ కానుంది. ఇప్పటికే సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ను సైతం గెలవాలనే పట్టుదలతో ఉంది. రోహిత్, కోహ్లీ, బూమ్రా ఈ సిరీస్ కు దూరం ఉండగా.. కేఎల్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. రుతురాజ్ గైక్వాడ్ జ్వరంతో బాధపడుతుండడంతో ఈ మ్యాచ్ ఆడడం డౌటే. ఇక ఈ మ్యాచ్తో రింకూ సింగ్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. అటు సంజూ శాంసన్కి కూడా తుది జట్టులో చోటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు సొంతగడ్డపై టీ20 సిరీస్ ఓడిన సఫారీ జట్టు వన్డేల్లోనైనా సత్తాచాటాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ బవుమాకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వగా.. మార్క్రామ్ టీంను నడిపించనున్నాడు. అతడితో పాటు హెన్రిక్స్, డసెన్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయోతో సౌతాఫ్రికా టీం పటిష్టంగా ఉంది.
ఈ క్రమంలో భారత్ - సౌతాఫ్రికా గత వన్డే రికార్డులను ఒకసారి పరిశీలిస్తే సఫారీలదే పైచేయి కనిపిస్తోంది. వన్డే క్రికెట్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 91 సార్లు తలపడగా.. సౌతాఫ్రికా 50, భారత్ 38 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో సౌతాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది. అదేవిధంగా రెండు జట్ల మధ్య జరిగిన చివరి 3 వన్డేల్లోనూ టీమిండియానే గెలిచింది. మ్యాచ్ జరుగుతున్న వాండరర్స్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 300కు పైచిలుకు రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచులో గెలుపెవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది.